19 May, 2026 | 1:02 AM

కలగా భగీరథ జలం!

19-05-2026 12:00 AM
  1. రాజీవ్‌నగర్‌లో సరఫరా కాని నీరు 
  2. తొమ్మిదేళ్లుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు 
  3. బోరింగులపైనే ఆధారం 
  4. నిరుపయోగంగా మిషన్ భగీరథ ట్యాంక్ 

వాంకిడి, మే 18 (విజయక్రాంతి) : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి శుద్ధ జలం అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. మారుమూల పల్లెల్లోనూ కోట్ల రూపాయలు వేచించి, మిషన్ భగీరథ ట్యాంకులు నిర్మాణం, ఇంటింటికి నల్ల కనెక్షన్లు ఏర్పాటు చేశారు. కానీ అధికారులు చేసిన నిర్లక్ష్యానికి  మిషన్ భగీరథ తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.

వాంకిడి మండలం బంబార గ్రామపంచాయతీ పరిధిలోని రాజీవ్ నగర్ గ్రామంలో నీళ్ల ట్యాంక్ నిర్మించి ఇంటింటికి నల్ల కనెక్షన్లు ఇచ్చారు. కానీ ఇప్పటికి నీళ్లు పట్టింది లేదని ఆ గ్రామస్తులు వాపోతున్నారు. ఎక్కడ చూసినా లీకేజీలతో ఎత్తు ప్రాంతాలకు నీరు సరఫరా కావడం లేదు. కొన్ని విధుల్లో రోడ్డు మధ్య నుంచి సీసీ రోడ్డు కారణంగా లీకేజీలకు మరమ్మతులు చేయలేని పరిస్థితి ఏర్పడింది. 

నాసిరకం పనులు...

మిషన్ భగీరథ పథకంలో చేపట్టిన నాసిరకం పనులు తేలిపోతున్నాయి. రాజీవ్ నగర్ గ్రామంలో నిర్మించిన నీళ్ల ట్యాంకు ఇప్పుడే శిథిలావస్థకు చేరుకుంది. ట్యాంకు పైకి ఎక్కేందుకు నిర్మించిన మెట్లు దెబ్బతిన్నాయి. దీంతో ట్యాంకు పైకి ఎక్కి ట్యాంకు శుభ్రం చేయడం అసాధ్యంగా మారుతుంది. ఒకవేళ మరమ్మతులు చేపట్టి నీటి సరఫరా ప్రారంభించిన కాలుషిత నీరే దిక్కవుతుందని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని ఏళ్లుగా మిషన్ భగీరథ నీళ్లు లేదు:- శ్యామ్ రావు, రాజీవ్ నగర్, వాంకిడి మిషన్ భగీరథ నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నాం.కొన్ని ఇండ్లకు అప్పుడప్పుడు సన్నటి ధారాల నీరు వస్తుంది. అది కూడా ఒక బింద నీళ్లు మాత్రమే వస్తాయి. దీంతో అన్ని అవసరాలకు బోరింగ్ నీరే వాడుతున్నాం. ట్యాంకును శుభ్రం చేసి మరమ్మతులు చేపట్టి ప్రతి ఇంటికి సరిపడా మిషన్ భగీరథ నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.

అధికారులు స్పందించడం లేదు..

బంబార గ్రామపంచాయతీ పరిధిలోని రాజీవ్ నగర్ గ్రామంలో మిషన్ భగీరథ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాం మిషన్ భగీరథ జేఈ, డీఈలకు పలుమార్లు సమస్య విన్నవించాం. అయినా ఎవరు పట్టించుకోవడం లేదు. సమస్యను గ్రామస్తులతో కలిసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం.

 బెండరే కృష్ణాజి, సర్పంచ్,

బంబార,వాంకిడి మండలం