19 May, 2026 | 1:45 AM

సైబరాబాద్‌లో బదిలీల గందరగోళం!?

19-05-2026 12:34 AM
  1. గంటల వ్యవధిలోనే 65 మంది ఇన్స్పెక్టర్ల స్థానచలనం బ్రేక్
  2. 32 మంది ఎస్‌ఐల సరెండర్ హడావుడి.. 
  3. ఖాళీగా మారిన కీలక సీట్లు ఒత్తిడితో ‘ఐటీ కారిడార్’ 
  4. ఉక్కిరిబిక్కిరి.. శాంతిభద్రతలపై నీలినీడలు?

శేరిలింగంపల్లి, మే 18 (విజయక్రాంతి): శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన, ప్రతిష్టాత్మకమైన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఇప్పుడు బదిలీల గందరగోళంలో కొట్టుమిట్టాడుతోంది.పరిపాలనాపరమైన సమన్వయ లోపమో, లేక అంతర్గత ఒత్తిళ్లకు తలొగ్గడమో తెలియదు కానీ, ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలు పోలీస్ శాఖలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాగితాలపై బదిలీల ఫైళ్లు పరుగులు పెడుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం స్టేషన్లు వెలవెలబోతున్నాయి. ఫలితంగా సిబ్బంది కొరతతో ఐటీ కారిడార్లో పోలీసింగ్ వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

మే 2న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒకేసారి 65 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణంగా ఇలాంటి భారీ బదిలీల వెనుక వారం రోజుల పాటు తీవ్రస్థాయిలో కసరత్తు జరుగుతుంది. కానీ, ఏమైందో ఏమో తెలీదు కానీ.. ఉత్తర్వులు వెలువడిన కొద్ది గంటల్లోనే ఆ ఆర్డర్లను నిలిపివేస్తూ (హోల్డ్లో పెడుతూ) మరో ఆదేశం రావడం డిపార్ట్మెంట్లో కలకలం రేపింది. ఆర్డర్ వచ్చింది.. సీట్ మారుతుందనుకునే లోపే బ్రేక్ పడింది‘ అంటూ ఇన్స్పెక్టర్లు సైతం తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈ వెనకడుగు వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? లేక అంతర్గత వ్యూహాత్మక లోపాలు ఉన్నాయా? అనే చర్చ జోరుగా సాగుతోంది.

ఎస్‌ఐల సరెండర్ హడావుడి.. ఇన్కమింగ్ ఎక్కడ?

ఇన్స్పెక్టర్ల బదిలీల వ్యవహారం ఒక కొలిక్కి రాకముందే.. కమిషనరేట్ పరిధిలోని 32 మంది సబ్‌ఇన్స్పెక్టర్లను (ఎస్‌ఐలను) జోన్-6 చార్మినార్కు సరెండర్ చేస్తూ హుటాహుటిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. పైగా, ఆర్డర్లు వచ్చిన వెంటనే వారందరినీ రిలీవ్ చేయడంతో వారంతా కొత్త ప్రాంతాల్లో రిపోర్ట్ చేయడానికి వెళ్ళిపోయారు.దీనికి బదులుగా హైదరాబాద్ సిటీ నుంచి మరో 32 మంది ఎస్‌ఐలను సైబరాబాద్కు కేటాయించాలనే ప్రతిపాదనలు అయితే సిద్ధం చేశారు కానీ, వారు క్షేత్రస్థాయిలో విధుల్లో చేరడానికి ఇంకా ముహూర్తం కుదరలేదు. వెళ్ళిన వారు వెళ్ళిపోయారు.. రావాల్సిన వారు రాలేదు. మధ్యలో స్టేషన్లలో ఉన్న సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. దీనివల్ల మిగిలిన సిబ్బందిపై పనిభారం రెట్టింపు అయ్యింది.

ఐటీ కారిడ్పా ‘అదనపు’ భారం

గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్కు గుండెకాయ లాంటి ఐటీ కారిడార్ పరిధిలోని పోలీస్ స్టేషన్లపై ఈ బదిలీల ప్రభావం తీవ్రంగా పడింది. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, నార్సింగి, కూకట్పల్లి, బాచుపల్లి. అంతర్జాతీయ స్థాయి ఐటీ కంపెనీలు, లక్షలాది మంది ఉద్యోగుల రాకపోకలు, నిత్యం ట్రాఫిక్ జాంలు, వీఐపీల బందోబస్తులు, హై-ప్రొఫైల్ నేరాలు. ఇలాంటి అత్యంత సున్నితమైన, బిజీ స్టేషన్లలో ఎస్‌ఐల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణ,క్రైమ్ ఇన్వెస్టిగేషన్, రాత్రి పూట పెట్రోలింగ్, బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ వంటి బాధ్యతలను కొద్దిమంది సిబ్బందే అదనపు షిఫ్టులు చేస్తూ నిర్వహించాల్సి వస్తోంది. సుదీర్ఘ గంటల పనివల్ల క్షేత్రస్థాయి సిబ్బంది తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి లోనవుతున్నారు.

సమన్వయ లోపానికి పరాకాష్ట

సాధారణంగా పోలీసు సిబ్బంది లో ఒకరిని బదిలీ చేసినప్పుడు, ఆ స్థానంలో మరొకరు వచ్చి చేరేవరకు పాతవారిని రిలీవ్ చేయకూడదనేది‘ కనీస పరిపాలనా నియమం. కానీ సైబరాబాద్లో మాత్రం కాగితాల్లో భర్తీ చూపిస్తూ, క్షేత్రస్థాయిని ఖాళీ చేసేశారు. ఐటీ కారిడార్ లాంటి సున్నితమైన ప్రాంతాల్లో ఇలాంటి భద్రతా లోపాలు లేదా సిబ్బంది కొరత కొనసాగితే.. భవిష్యత్తులో అది శాంతిభద్రతల సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, గందరగోళానికి గురైన బదిలీల ప్రక్రియను క్రమబద్ధీకరించి, ఐటీ కారిడార్ స్టేషన్లకు తక్షణమే పూర్తిస్థాయి సిబ్బందిని కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.