9 May, 2026 | 8:15 PM

చిల్లర రాజకీయాలు చేయడం దురదృష్టకరం

09-05-2026 07:11 PM

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

జడ్చర్ల: ప్రతిపక్ష నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) నూతన పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమంలో జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పాలకమండలి చైర్మన్ సుదర్శన్ గౌడ్, వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, డైరెక్టర్లకు ఎమ్మెల్యే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమం, సహకార సంఘాల బలోపేతం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. కొంతమంది నాయకులు స్వార్థ రాజకీయాల కోసం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.జడ్చర్ల మార్కెట్‌లో మక్కల కొనుగోలు విషయంలో మాజీ ఎమ్మెల్యేకు చెందిన వ్యక్తి రాజకీయాలు చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

రైతుల వద్ద నుంచి మక్కలు కొనుగోలు చేయకుండా అడ్డంకులు సృష్టించి, రైతులను అవమానకరంగా మాట్లాడటం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీనిపై ఆగ్రహించిన రైతులు రోడ్డు బైఠాయించి ధర్నా నిర్వహించారని తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్న మాజీ ఎమ్మెల్యే,ఆ ధర్నాలో కూర్చోవడం సిగ్గుచేటు విషయమని వ్యాఖ్యానించారు. అందుకుగాను వెంటనే మార్కెట్లో విధులు నిర్వహిస్తున్న వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు.

జడ్చర్ల ప్రజలు అభివృద్ధి, ప్రజాసేవ కోసం కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం అందించారని,ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గతంలో జరిగిన అవినీతి, అక్రమాలు, కుంభకోణాలపై పూర్తి వివరాలతో త్వరలోనే ప్రజల ముందుకు వస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, PACS సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు, కార్యకర్తలు, ప్రజలు  పాల్గొన్నారు.