9 May, 2026 | 8:15 PM

భార్యా భర్తలు అనుమానాస్పదంగా మృతి

09-05-2026 07:09 PM

జడ్చర్ల: జడ్చర్ల పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులోని విజయనగర్ కాలనీలో ఆకుతోట శేఖర్ (56), ఆకుతోట వరాలు (49) తమ ఇంట్లో పడుకున్న చోటే మృతిచెంది పడి ఉండటం చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. శేఖర్ పట్టణంలో బియ్యం వ్యాపారంతో పాటు చీటీల ఏజెంట్గా వ్యవహరించేవాడు. ఆయన భార్య వరాలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు స్థానికులు చెప్పారు. రెండు రోజులుగా శేఖర్ కు కూడా జ్వరం ఉండడంతో ఇంట్లోనే ఉన్నాడని సమాచారం. ఉదయం వరకు తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన కుమారుడు కిటికీ ద్వారా చూడగా, ఇద్దరూ చలనం లేకుండా పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఎస్సెలు మల్లేష్, జయప్రసాద్ ఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు.ఇద్దరు భార్యాభర్తలు క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని కాలనీవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ఆత్మహత్య చేసుకునేంత సమస్యలు వీరికి లేవని, ఆర్థిక పరిస్థితి కూడా బాగానే ఉందని స్థానికులు చెబుతున్నారు. ఆరోగ్య సమస్యల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.