22 May, 2026 | 2:56 AM

కార్మికులకు శుభవార్త కనీస వేతనాల పెంపు

22-05-2026 01:43 AM

జూన్ 1 నుంచి అమలు

మూడు జోన్లు: జోన్- -1 మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్-- 2 మున్సిపాలిటీలు, జోన్- -3 గ్రామీణ ప్రాంతాలు

కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని వెల్లడి 

కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే కార్మికులు పదేళ్లు నష్టపోయారు

త్వరలోనే ఒక అద్భుతమైన ‘గల్ఫ్ పాలసీ’ని తీసుకురాబోతున్నాం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి) : తెలంగాణలోని లక్షలాది మంది కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో శ్రామికుల కనీస వేతనాలను భారీగా పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారికంగా ప్రకటించారు.

పెంచిన ఈ కొత్త వేతనాలు వచ్చే జూన్ 1 నుంచే అమల్లోకి రానున్నాయని తెలిపారు. గురువారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. వేతనాల సవరణ కోసం రాష్ట్రా న్ని మూడు జోన్లుగా విభజించినట్లు చెప్పారు.

ఇందులో జోన్--1 కింద మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్--2 కింద మున్సిపాలిటీలు, జోన్-3 కింద గ్రామీణ ప్రాంతాలను చేర్చినట్లు సీఎం వెల్లడించారు. కార్మికుల కనీస వేతనాలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించామని, కార్మికులను నాలుగు విభాగాలుగా చేసి కనీస వేతనాలు నిర్ణయించామన్నారు.

గత పదేళ్ల కేసీఆర్ హయాంలో కార్మికుల కనీస వేతనాలను నిర్ణయించడంలో ఘోరమైన నిర్లక్ష్యం వహించారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

ఫలితంగా రాష్ట్రంలో దాదాపు 1.11 కోట్ల మంది కార్మికులు పదేళ్ల పాటు తీవ్రంగా నష్టపోయారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

తమ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అందుకే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అలాగే, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కార్మికుల రక్షణ, సంక్షేమం కోసం త్వరలోనే ఒక అద్భుతమైన ’గల్ఫ్ పాలసీ’ని తీసుకురాబోతున్నామని, ప్రస్తుతం గల్ఫ్ వెళ్లేవారి బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటోందని భరోసా ఇచ్చారు.

కేవలం డిగ్రీలు పూర్తి చేసి, ఉద్యోగం లేదా ఉపాధి రాని చదువులతో ఎలాంటి ప్రయోజనం లేదని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్ (ఏఐ) సాంకేతికతను దృష్టిలో పెట్టుకుని నైపుణ్య ఆధారిత చదువులపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర యువత తమ స్కిల్స్ పెంచుకుంటేనే మార్కెట్లో ఉద్యోగ భద్రత ఉంటుంద న్నారు.

ఏఐ ఎంత వేగంగా విస్తరించినప్పటికీ.. శారీరక శ్రమతో కూడిన ’బ్లూ కాలర్’ ఉద్యోగాలకు ఎలాంటి ముప్పు ఉండదని ఆయన స్పష్టం చేశా రు. ప్రపంచ మార్కెట్లో చైనా, జపాన్, సౌత్ కొరి యా దేశాల ఉత్పత్తులకు భారతదేశం, ముఖ్యంగా తెలంగాణ ప్రత్యామ్నాయంగా ఎదగాలన్నదే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

కేటీఆర్‌కు బండికి మధ్య ఏదో పంచాయతీ.. 

ఏ కేసులోనైనా ప్రభుత్వం చట్ట ప్రకారమే నడుచుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. డ్రగ్స్ తీసు కున్న వారిని బాధితులుగా చూడాలని చట్టం చెబుతోందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే జైలు కు పంపిస్తున్నామని,  అదే డ్రగ్స్, గంజా యి తీసుకుంటూ దొరికితే బాధితుడిగా చెబుతూ స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చట్టంలో ఉందన్నారు.  ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పాలన్నారు.

ఈ చట్టాల్లో ఉన్న లొసుగులను కేటీఆర్ ఆయన బావమరిది ఉపయోగించుకుంటున్నారని ఈ చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందన్నారు.  బండి భగీరథ్ కేసు చాల సున్నిత మైన కేసు అని ఇందులో కేసు నమోదు చేసిన సెక్షన్లు,  అరెస్టు, రిమాండ్, కోర్టులో మా వాదనలో ఎక్కడైనా లోపముందా ..? అని సీఎం ప్రశ్నించారు. కేటీఆర్‌కు బండి సంజయ్‌కు ఎదో పంచాయతీ ఉందని దాన్ని పిల్లల మీద పెట్టి పగ సాధించాలనుకుంటే ఎట్లా అన్నారు.

కేసీఆర్ ఎక్కడ నిద్రపోతున్నారు?

బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో ప్రభుత్వ చర్యలపై కేటీఆర్ చేస్తున్న విమర్శలపై సీఎం  రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కేటీఆర్ ఆరోపణలే నిజం అయితే ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎందుకు ఓ స్టేట్‌మెంట్ ఇవ్వలేదని సీఎం ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ నిద్రపోతున్నాడని ప్రశ్నించారు.

కేసీఆర్‌కు బయటకు వచ్చి మాట్లాడేందుకు శక్తి లేకపోతే ఒక ప్రెస్‌నోట్ అయినా ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. పక్క పార్టీ నుంచి నేత వస్తే జగిత్యాల వరకు వెళ్లి వచ్చిన కేసీఆర్ రాష్ట్రంలో ఇంత మేజర్ ఇన్సిడెంట్ జరిగితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు స్పందించకుండా ఎటుపోయారు అని సీఎం  నిలదీశారు.

పెట్రోల్, డీజిల్ ధరలు రోజుకోసారి పెంచుతారా..? 

ప్రజా సమస్యలు, దేశాల మధ్య యుద్దాన్ని బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తోందని సీఎం విమర్శించారు, అం దుకే ఎన్నికలు అయిపోగానే పెట్రోల్, డీజిల్ ధరలను రోజుకోసారి పెంచుతున్నారని ఆయన మం డిపడ్డారు. తమ ప్రభుత్వం ప్రతి అంశాన్నీ దీర్ఘకాలిక దృష్టిలో చూస్తోందని, అందుకే కార్మికుల కనీస వేతనం పెంపుపై నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు.

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ 80 శాతం పూర్తయిందని, ఇంకా 20 మిగిలి ఉందన్నారు, రైతుల విషయంలో శవ రాజకీయాలు చూస్తున్నారని, రాజకీయాల కోసం మరీ ఇంత దిగజారీ వ్యవహారిస్తారా..? అని నిలదీశారు. రైతులపై ప్రతిపక్షాలకు నిజంగా ప్రేమ ఉంటే ప్రభుత్వా నికి సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. 

భగీరథ్‌ను అరెస్ట్ చేశాం 

బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు పద్ధతి ప్రకారం దర్యాప్తు చేస్తున్నారని, ఫిర్యాదు వచ్చిన వెంటనే భగీరథ్ కేసులో చర్యలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. భగీరథ్ లొంగిపోలేదని పోలీసులు అతడిని అరెస్టు చేశారని సీఎం తెలిపారు. తనిఖీల్లో బండి భగీరథ్ దొరికాడని పోలీసులు చెప్పారని నేను పోలీసుల మాటలనే నమ్ముతున్నానని చెప్పారు.

భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ జడ్జీలుగా మారి తీర్పులు ఇస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పోక్సో కేసులో బాధితుల వివరాలు బహిర్గతం చేయకూడదని కానీ వీరు మైనర్ అమ్మాయిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నేతల మాదిరిగా రోడ్డుమీద పడి మాట్లాడి తే బాధిత కుటుంబం ఆవేదన ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

భగీరథ్ అంశంలో కేటీఆర్ మనిషిలా ప్రవర్తించడం లేదంటూ సీఎం ఫైర్ అయ్యారు. కేటీఆర్‌కు రాజకీయాలు కావాలంటే రాజకీయంగా కొట్లాడాలన్నారు. అంతే తప్ప ఒక మైనర్ బాలికను అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఏదో సాధించామనే ఈ శాడిజం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్‌లో  డ్రగ్స్ తీసుకుం టూ దొరికిపోతే ఆ సమయమంలో తన బావమరిదిని అరెస్టు చేయాలని ఎందుకు చెప్పలేద ని ప్రశ్నించారు.

అదే పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ కోడి పందేలు నిర్వహిస్తు దొరికిపోయాడు. దుబాయ్‌లో చనిపోయిన టాలీవుడ్ నిర్మాత కేదార్ మిత్రుడు, బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ పోలీసులపై కాల్పులు జరిపారు. ఆనాడు కేటీఆర్ ఏ బొక్కలో పడుకున్నాడని సీఎం  సీరియస్ అయ్యారు. చట్టాన్ని గౌరవిస్తామని చెబుతున్న కేటీఆర్ వారిని ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ఇంత కంటే సిగ్గుతప్పి ఎవరైనా మాట్లాడుతారా ..? అని సీఎం  నిలదీశారు.

డ్రగ్స్ కేసులో దొరికిన కేటీఆర్ బావ మరిదికి నోటీసులు ఇచ్చారని, పోక్సో కేసులో బండి భగీరథ్‌కు  కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారన్నారు. నోటీసులు ఇచ్చాక భగీరథ్ తరపున సమయం కోరారని, బాలిక మైనరా కాదా అనే విషయంలో  సమాచారం సేకరించామన్నారు. అమ్మాయి మైనర్ అని నిర్ధారించు కు న్నాక వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుందని ప్రభుత్వ చర్యలను కోర్టు తప్పపట్టలేదన్నారు.