22 May, 2026 | 2:55 AM

ఎన్నాళ్లీ మొద్దునిద్ర?

22-05-2026 01:47 AM
  1. రైతుల ప్రాణాలు పోతున్నా.. పంటలు కొనరా?
  2. ధాన్యం తగేలబెట్టుకుంటున్నా తండ్లాట తీర్చరా?
  3. క్యాబినెట్ మీటింగ్‌లోనైనా కళ్లు తెరవండి..
  4. సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ

హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి) : పంట కొనుగోళ్ల సంక్షోభంపై ఎన్నాళ్లీ మొద్దు నిద్ర అని సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రైతుల ప్రాణాలు పోతున్నా పంటలు కొనరా.. కొనుగో లు కేంద్రాల్లో కుప్పకూలుతున్నా కనికరించరా? ధాన్యం తగలబెట్టుకుంటు న్నా తండ్లాట తీర్చరా? అని నిలదీశా రు. కొనుగోలు కేంద్రాల్లో ఈ మరణమృదంగమేంటి అని ప్రశ్నించారు. రాష్ట్రంలో  రోడ్డెక్కని రైతు లేడని, రాస్తారోకో జరగని రహదారి లేదని తెలిపారు. ఇవాళ బూతులు తిడుతున్న రైతులే.. రేపు వాతలు పెడతారని విమర్శించారు. కాంటా పెట్టని కాంగ్రెస్ సర్కారుకు రైతు చేతిలోనే  కౌంట్ డౌన్ మొదలైందని హెచ్చరించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి గురువారం రాసిన లేఖలో నిప్పులు చెరిగారు. 

తెలంగాణలో తొమ్మిదిన్నరేళ్లపాటు కొండంత ధైర్యంతో బతికిన అన్నదాత ఇవాళ ఆత్మవిశ్వాసం కోల్పో యి రోడ్డున పడ్డాడని, ఆరు దశాబ్దాల పాటు పడ్డ కష్టాలు శాశ్వతంగా తీరిపోయాయని సంబురంగా సాగుచేసుకుం టున్న రైతు నోట్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మట్టికొట్టిందని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుకు రక్షణగా కేసీఆర్ అమలుచేసిన ఒక్కో పథకానికి గత రెండేన్నరేళ్లుగా పాతరేసిన మీరు మీ చేతకానితనంతో అన్నదాత వెన్నువిరిచారని వి మర్శించారు.

మీ అరాచక పాలన ఆనవాళ్లు పరాకాష్టకు చేరాయని, అష్టకష్టాలు పడి పండించిన పంటను కొనే దిక్కులేక రెండునెలలుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఆర్త నాదాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. చేతకాని మీ సర్కారు నిర్వాకం వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఏ మూలన చూసినా ఈరో జు రైతులు నిత్యం ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారని, పంట అ మ్ముకుందామనే ఆశతో వచ్చిన రైతులు రోజుల తరబడి పడిగాపులు పడలేక  కొనుగోలు కేంద్రాల్లోనే గుండెపగిలి కుప్పకూలు తున్నా మీ సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు.

70 సార్లు ఢిల్లీకి చక్క ర్లు కొట్టడంలో మీకున్న శ్రద్ధలో ఒక్క శాతం రైతులపై పెట్టి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని, మీ కుర్చీని కాపాడుకోవడానికి ఢిల్లీకి మూటలు మోయడం తప్ప రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనాలన్న సోయి మాత్రం మీలో కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెట్టుబడి సాయాన్ని వరుసగా నాలుగు సార్లు ఎగ్గొట్టినా, యూరియా కష్టాల పాలుజేసినా రైతులు అన్నింటినీ దిగమింగి పం డించిన ఏ పంటను మీ ప్రభుత్వం కొనుగోలు చేసిన పాపాన పోలేదని, ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద దాదాపు పదిమంది రైతులు వడదెబ్బకుతోడు సర్కారు చేసిన ద్రోహానికి తమ నిండు ప్రాణాలు కోల్పోనా కనీసం ఒక్కసారైనా మీరు ఏ ఒక్క కొనుగోలు కేంద్రం వైపు కన్నెత్తి చూసిన దాఖలా లేదని విమర్శించారు. 

నాటి సకల కష్టాల్లో రైతులు

అందుకే రైతులు మరో మార్గం కనిపించక, ఇంతకాలం కంటిపాపలా పెంచుకున్న పంటను తమ చేతులతోనే తగలబెట్టుకుంటున్నారని, ప్రస్తుతం తెలంగాణలోని రోడ్లపై కాలిబూడిదవుతున్న ధాన్యం కుప్పలు మీ అసమర్థతకు ప్రత్యక్ష సాక్ష్యాలని ఎద్దేవా చేశా రు. గత రెండు నెలలుగా రాష్ట్రంలో నిరసనలో పాల్గొనని రైతు లేడు, రాస్తారోకో జర గని రహదారి లేదని తెలిపారు. ఈ 30 నెలల్లోనే సమైక్యరాష్ట్రం నాటి సకల కష్టాల్లో మళ్లీ రైతులను ముంచెత్తారని, ఇన్నాళ్లు సంతోషంగా సాగిన సాగును కన్నీటి సేద్యం గా మార్చారని, కష్టాల్లో కొట్టమిట్టాడుతున్న తెలంగాణ రైతుల కన్నీళ్లతో ఖాళీగా ఉన్న రిజర్వాయర్లు నిండేలా ఉన్నాయని మండిపడ్డారు.

పగలూ రాత్రి ప్రజాసంపదను దోచు కోవడంపై తప్ప పరిపాలనపై మీకు కనీస పట్టులేకపోవడం అన్నదాతకు శాపంగా మా రిందన్నారు. రోడ్లపై జరుగుతున్న నిరసనలనుంచి తప్పించుకునేందుకు, మీ మంత్రు లు హెలికాప్టర్‌లో షికార్లు కొడుతున్నారని, చివరికి మీ సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కూడా రైతులు రోడ్డెక్కి దుమ్మెత్తి పో సే దుస్థితి వచ్చిందంటే, సాగు ఎంతటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో అర్థం చేసుకోవచ్చు పేర్కొన్నారు.

వరంగల్ నుంచి ఖమ్మం దాకా అనేక జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో రోజుకు కనీసం ఒక్క లారీలోడ్ కూడా ఎత్త డం లేదని, ఇక అడపా దడపా చేసే కొనుగోళ్లలోనూ 10 కిలోలకు పైగా తరుగుతీస్తే ఇక రైతులకు మిగిలేదేంటో మీరే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చివరికి గన్నీ బ్యాగు కోసం రైతులే రూ.50 చొప్పున డిపాజిట్ చేసే దుస్థితి తెచ్చినందుకు మీరు, మీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు.

రాష్ట్రంలోని 60 లక్ష ల మంది రైతులకు మీరు క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. అన్నదాతలు అడుగడుగడునా పడిగాపులు పడు తుంటే వాటిని వదిలేసి, పర్యాటక వారోత్సవాలు నిర్వహించాలన్న మీ సర్కారు కు ప్రాధాన్యతలే కాదు, చివరికి సోయి కూడా లేదని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. 

సర్కారుకు మరణశాసనం... 

కేసీఆర్ హయాంలో మూడు నెల ముందు నుంచే పంటల కొనుగోలు ప్ర ణాళికలను పకడ్బందీగా అమలుచేసే వా రని, గన్నీ బ్యా గుల నుంచి మొదలుకుని రైతుల ఖాతా ల్లో పంట డబ్బులు సకాలంలో జమ అయ్యేదాకా నిరంతర సమీక్ష లతో పర్యవేక్షించేవా రని, కరోనా కష్టకాలంలోనూ రైతు కల్లాల వద్దకే వెళ్లి చివరి గింజ వరకూ కొని రైతుల్లో అచెంచలమైన ఆత్మవిశ్వాసాన్ని నింపారని గుర్తు చేశారు.

అలా పండుగలా సాగిన వ్యవసాయంపై మీరు పగబట్టి రైతులకు చేసిన ద్రోహం అందరికీ అర్థమైపోయిందని, రైతు లు తమ పంటకు నిప్పు పెట్టుకుంటున్నా మొ ద్దునిద్ర వీడని ముఖ్యమంత్రిని చూసి యావత్ రైతాంగం శాపనార్థాలు పెడుతోందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాల నుంచి తమ పంటను కా పాడుకునేందుకు చివరికి టార్పాలిన్లు కూడా సమకూర్చలేని మీ కాంగ్రెస్ సర్కా రు ఉండి రైతులకు ఏం ప్రయోజనమని ప్రశ్నించారు.

వాన లు పడి కళ్లముందే పంట కొట్టుకుపోతున్నా కాపాడుకోలేని నిస్సాహాయ స్థితి లో రైతులు కొట్టుమిట్టాడు తు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ హ యాంలో సంబురంగా సాగిన సాగును కష్టాల కడలిలో ముంచెత్తిన మీ పాపానికి ఇప్పటికే వెయ్యి మంది కి పైగా రైతులు ఆత్మహత్యల పాలయ్యారని, రైతుల ఆర్థనాదాలు ఏమాత్రం విని పించుకునే తీరికలేని మీ పాలనకు రోజు లు దగ్గరపడ్డాయన్నారు.

మొత్తంగానే వ్యవసాయాన్ని పాతాళంలోకి నెట్టిన మీ దద్దమ్మ పాలనపై  ఇప్పటికే రైతుల్లో తిరుగుబాటు మొదలైందని, 60 రోజులు గడిచినా కొనుగోలు కేంద్రాల్లో కాంటా పెట్టని కాంగ్రెస్ సర్కారుకు మరణశాసనం రాసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రమంతా రైతుల నిరసనలు హోరెత్తుతున్న ఈ తరుణంలో 23న నిర్వహించే కేబినెట్ సమావేశంలోనైనా లెం పలేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టాలని హితవు పలికారు.

వేలాది కొనుగోలు కేంద్రాల్లో గుట్టలుగా పేరుకుపోయిన ప్రతి పంటను కొని వెంటనే రైతుల కష్టానికి ప్రతిఫలాన్ని అందించాలని, మీరు చేసిన పాపాలకు ఇప్పటిికే కొనుగోలు కేంద్రాల వద్ద కన్నుమూసిన రైతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకపోతే మీరు చరిత్రలో రైతుద్రోహిగానే మిగిలిపోతారని కేటీఆర్ హెచ్చరించారు.