చింతకుంట గ్రామ దాహార్తి తీర్చిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
అశ్వాపురం మే 21 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామపంచాయతీ పరిధిలోని చింతకుంట గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గ్రామ ప్రజల దాహార్తిని తీర్చారని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. గత 15 ఏళ్లుగా సుమారు 60 కుటుంబాలు నివాసం ఉంటున్న ఈ గ్రామంలో ఇప్పటికీ విద్యుత్, తాగునీటి సౌకర్యాలు పూర్తిస్థాయిలో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక దృష్టి సారించి గ్రామానికి విద్యుత్ లైన్ మంజూరు చేయించగా, ఫారెస్ట్ అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
తాగునీటి కోసం గతంలో ఏర్పాటు చేసిన బోరు తప్ప ఇతర ప్రత్యామ్నాయ సౌకర్యాలు లేకపోవడంతో వేసవిలో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం స్థానిక సర్పంచ్ మచ్చా నరసింహరావు, నాయకుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నిధులు మంజూరు చేసి అధికారులతో మాట్లాడి గురువారం కొత్త బోరు వేయించారు. దీంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి బిక్ష్మయ్య, సీనియర్ నాయకులు గాదే కేశవరెడ్డి, ఊస అనిల్, ఓరుగంటి రమేష్ బాబు, బూరెడ్డి వెంకటరెడ్డి, సర్పంచ్లు మచ్చా నరసింహరావు, కుంజా జాను, ఉపసర్పంచ్ హర్షా నాయక్, తూము వీరరాఘవులు, బేతం రామకృష్ణ, బచ్చు వెంకటరమణ, కొండాబత్తుల ఉపేందర్, బరాజు సంపత్, పద్దం రాజు, పద్దం నరసింహరావు, తెల్లం నాగరాజు, కుంజా భాస్కర్, కొమరం శ్రీను, చెంచల రాము, గుర్రం చెన్నయ్య, సామకూరి వెంకన్న, వేముల విజయ్, కోలా శశికాంత్ తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






