22 May, 2026 | 2:57 AM

పోక్సో బాధితులకు అన్ని సేవలు అందించడమే భరోసా కేంద్రం ముఖ్య ఉద్దేశం

22-05-2026 01:51 AM

ప్రతి ఒక్కరూ శారీరక దారుఢ్యం మరియు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి

వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి

వనపర్తి, మే 21 (విజయక్రాంతి): పోక్సో కేసుల బాధితులకు తదుపరి మానసిక క్షోభ కలగకుండా, వారి గోప్యతను కాపాడుతూ తగిన భద్రతను కల్పిస్తూ భరోసా కేంద్రాలు అండగా నిలుస్తున్నాయని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి  పేర్కొన్నారు.

గురువారం వనపర్తి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో డీఎస్పీ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ తో పాటు ఏఆర్ పోలీస్ హెడ్క్వార్టర్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆ యన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల్ల చిన్నారెడ్డి, ఎల్ ఎస్ చాహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మహిళలకు భరోసా కల్పించడమే భరోసా కేంద్రాల ప్రధాన లక్ష్యమని తెలిపారు.

హింస, వేధింపులు మరియు లైంగిక దాడులకు గురైన మహిళలు, పిల్లలకు తక్షణ సహాయం, రక్షణ అందించేందుకు తెలంగాణ పోలీస్ విభాగ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ’భరోసా కేంద్రాలు’ అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయన్నారు. బాధితులకు ఒకే చోట అన్ని రకాల సేవలను అందించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా వీటిని విస్తరిస్తున్నట్లు తెలిపారు. మద్యం సేవించడం వల్లే అనేక వేధింపులు, సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొంటూ, ప్రజలు తమ అలవాట్లను మార్చుకుని మద్యం సేవనాన్ని తగ్గించాలని సూచించారు. హెల్త్ ఈజ్ వెల్త్ అని పేర్కొంటూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని కోరారు.

పాత భవనాలను పునరుద్ధరించి వినియోగించడం కూడా మంచి అలవాటని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక క్రీడా వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న క్రీడా కార్యక్రమాలు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక దారుఢ్యం ఎంతో అవసరమని తెలిపారు.నల్లచెరువు మినీ ట్యాంక్బండ్ వద్ద రెండు జిమ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పోక్సో కేసుల బాధితులకు ఒకే చోట న్యాయ సహాయం, మానసిక భరోసా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2018లో భరోసా కేంద్రాలను ప్రారంభించిందన్నారు.

ఈ విధానం ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతూ వారికి అవసరమైన సహాయం అందించడం భరోసా కేంద్రాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ సహకారంతో ఏఆర్ హెడ్క్వార్టర్స్లో జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ శారీరక దారుఢ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. పోలీసులు మరియు యువత జిమ్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఒకే వాతావరణంలో వైద్యం, చట్టపరమైన సహాయం, మానసిక కౌన్సెలింగ్ మరియు పునరావాసం కల్పిస్తున్నట్లు తెలిపారు. పోక్సో మరియు రేప్ కేసుల బాధితులకు తదుపరి మానసిక క్షోభ కలగకుండా, వారి గోప్యతను కాపాడుతూ తగిన భద్రతను భరోసా కేంద్రాలు చేకూరుస్తున్నాయన్నారు. తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం ఐజి చారు సిన్హా నేతృత్వంలో రాష్ట్రంలో మహిళా భద్రతకు అత్యధిక ప్రాధాన్యత పోలీసు శాఖ కల్పిస్తుందని తెలిపారు.

క్రికెట్ విజేతలకు బహుమతులు ప్రధానం

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక క్రీడా మరియు యువజన వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ టోర్న మెంట్లో పోలీస్ జట్టు విజేతగా నిలవగా, ఉపాధ్యాయుల జట్టు రన్నరప్గా నిలిచిందన్నారు. అనంతరం పోలీసు సిబ్బందికి నూతన క్యాప్స్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీత రెడ్డి, అదనపు ఎస్పీ రాజేష్, ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి,  మీనా, డీఎస్పీలు బాలాజీ నాయక్, గిరి ప్రసాద్, మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, ఇతర అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.