9 May, 2026 | 7:52 PM

పూసాలలో భక్తి పారవశ్యంతో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

09-05-2026 06:44 PM

భారీగా పాల్గొన్న హనుమాన్  భక్తులు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ లోని పూసలలో శనివారం  హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర భక్తి, ఉత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించడం జరిగింది. శంభు లింగేశ్వర స్వామి దేవాలయ, హనుమాన్ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు, నిర్వహించిన అనంతరం భారీ శోభాయాత్రను ప్రారంభించారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి ప్రపత్తిని చాటుకున్నారు.

శోభాయాత్రలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అందంగా అలంకరించిన రథంపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. డప్పు వాయిద్యాలు, భజనలు, కోలాటాలు, కాషాయ జెండాలతో గ్రామ వీధులన్నీ ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి. జై శ్రీరామ్ జై హనుమాన్” నినాదాలతో పూసాల గ్రామం మార్మోగిపోయింది. వార్డులలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ శోభాయాత్రకు మహిళలు ఆంజనేయ స్వామి  టెంకాయలు కొట్టి,హారతులతో స్వాగతం పలికారు.

యువకులు భారీ  సంఖ్యలో పాల్గొని క్రమశిక్షణతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తులకు నిర్వాహకులు చల్లని నీరు, పానీయాలు, ప్రసాదాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, హనుమాన్ జయంతి వేడుకలు యువతలో భక్తి, దేశభక్తి, ధైర్యసాహసాలను పెంపొందిస్తాయని తెలిపారు. ప్రతి సంవత్సరం కంటే ఈసారి మరింత వైభవంగా శోభాయాత్ర నిర్వహించామని హనుమాన్ భక్తులు పేర్కొన్నారు. శాంతియుత వాతావరణంలో ముగిసిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత, మహిళలు, హనుమాన్  భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.