9 May, 2026 | 7:42 PM

ధాన్యం అన్‌ లోడింగ్‌ను రెట్టింపు వేగంతో పూర్తి చేయాలి

09-05-2026 06:48 PM

రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష 

సుల్తానాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో ధాన్యం అన్‌ లోడింగ్‌ను రెట్టింపు వేగంతో పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. శనివారం  సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ లో సాయి తేజ రైస్ మిల్, పూసాల గ్రామంలోని కళ్యాణి రైస్ మిల్, కాట్నపల్లి గ్రామంలోని గౌరీనాథ్ రైస్ మిల్, మమతా రైస్ మిల్, సదాలక్ష్మి రైస్ మిల్, లక్ష్మీ గణపతి రైస్ మిల్, అలాగే పూసాల గ్రామంలోని పరమేశ్వర రైస్ మిల్లులను సందర్శించి ధాన్యం అన్‌లోడింగ్, నిల్వలు, ట్యాబ్ ఎంట్రీలు, ట్రక్ షీట్ల జనరేషన్ తదితర అంశాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ రైస్ మిల్లుల వద్ద హమాలీల సంఖ్యను వెంటనే పెంచి అన్‌లోడింగ్ ప్రక్రియను రెట్టింపు వేగంతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుండి నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే రైస్ మిల్లులకు తరలిస్తున్న నేపథ్యంలో మిల్లుల వద్ద ఎటువంటి ధాన్యం కోతలు విధించరాదని స్పష్టం చేశారు. ట్రక్ షీట్లు వెంటనే జనరేట్ చేయాలని, ట్యాబ్ ఎంట్రీలు 100 శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు సంబంధించిన చెల్లింపులు త్వరితగతిన వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాబోయే ఏడు రోజులలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ధాన్యం తడవకుండా అన్ని రైస్ మిల్లులు, కొనుగోలు కేంద్రాల్లో ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లు సమృద్ధిగా నిల్వ ఉంచాలని, అవసరమైన రవాణా వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.ఈ తనిఖీలలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనాథ్, సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్ నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.