9 May, 2026 | 8:14 PM

శాంతియుత వాతావరణంలో బక్రీద్ పండుగను జరుపుకోవాలి

09-05-2026 06:51 PM

• నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

 • జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి

ధర్మపురి,(విజయక్రాంతి): బక్రీద్ పండుగ సందర్భంగా ధర్మపురి పోలీస్ స్టేషన్ లో ధర్మపురి సర్కిల్ స్థాయి పీస్ కమిటీ సమావేశాన్ని సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పండుగ సందర్భంగా చెక్‌పోస్టులను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన అన్ని నియమాలు, షరతులను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వధశాలలు కూడా అన్ని రకాల అనుమతులు, నిబంధనల ప్రకారమే నిర్వహించాలన్నారు.

సోషల్ మీడియాలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అవాంఛనీయ పోస్టులు, సందేశాలు ప్రచారం చేసిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామనీ హెచ్చరించారు. సీఐ రాo నర్సింహారెడ్డి  మాట్లాడుతూ బక్రీద్ సందర్భంగా పశువుల రవాణా పరిమిత స్థాయిలో మాత్రమే జరగాలని సూచించారు. ధర్మపురి పట్టణంలో ఆవుల వధా పూర్తిగా నిషేధించబడిందని స్పష్టం చేశారు. అలాగే గోరక్ష కమిటీ సభ్యులు స్వచ్ఛందంగా పెట్రోలింగ్ నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు కలిగించరాదని హెచ్చరించారు.

ధర్మపురి పట్టణంలో గతంలో నుండి కొనసాగుతున్న హిందూ–ముస్లింల ఐక్యతను ప్రతి ఒక్కరూ కాపాడాలని కోరారు. ఈ సమావేశంలో ధర్మపురి ఎస్సైలు జి. మహేష్, ఎం. రవీందర్, వెల్గటూర్ ఎస్సై పి.ఉదయ్ కుమార్, గొల్లపల్లి ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి, బుగ్గారం ఎస్సై జి. సతీష్, ధర్మపురి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి, గ్రంథాలయ చైర్మన్ సంగనభట్ల దినేష్, వెటర్నరీ వైద్యులు వేణు గోపాల్,డాక్టర్ శ్రీప్రియ, వివిధ మతాల మత పెద్దలు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.