18 March, 2026 | 10:03 PM

దళారులను నమ్మి మల్టీపర్పస్ వర్కర్స్ ఉద్యోగాల పేరుతో మోసపోవద్దు

18-03-2026 06:42 PM

జోగు అరవింద రెడ్డి

గరిడేపల్లి,(విజయక్రాంతి): మల్టీపర్పస్ వర్కర్లుగా ఉద్యోగం ఇస్తామంటూ చెప్పే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని పొనుగోడు ఉప సర్పంచ్ జోగు అరవింద్ రెడ్డి అన్నారు. గరిడేపల్లిలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... మండలంలోని పొనుగోడు గ్రామంలో పంచాయతీ వర్కర్లుగా మల్టీపర్పస్ విధానంతో కొందరిని తీసుకుంటామంటూ జరుగుతున్న ప్రచారాన్ని అదునుగా తీసుకొని కొంతమంది దళారీలు అమాయకుల వద్ద ఒక్కొక్కరి నుంచి లక్ష రూపాయలు తీసుకొని ఉద్యోగం ఇప్పిస్తానంటున్నారని ఆయన తెలిపారు.

కొంతమంది దళారులు అమాయకుల వద్ద లక్షల రూపాయలు తీసుకుంటూ చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు ఆయన తెలిపారు.మల్టీపర్పస్ ను రాష్ట్రవ్యాప్తంగా తీసుకోవడం జరుగుతుందని అలా కాకుండా ఏ ఒక్క మండలానికి, గ్రామం వరకే ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. మల్టీపర్పస్ వర్కర్లుగా చేరేవారు దళారీల మాట నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు అని కోరారు. సిబ్బంది కొరతతో ప్రభుత్వం నిబంధనల మేరకు ఆన్లైన్ విధానం ద్వారా మల్టీపర్పస్ వర్గాలను తీసుకుంటారని తెలిపారు.

మల్టీపర్పస్ విధానం ద్వారా సిబ్బందిని తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సర్క్యులర్ విడుదల కాలేదని ఆయన వివరించారు. ప్రభుత్వానికి, అధికారులకు సంబంధం లేకుండా కేవలం దళారులు అమాయకులను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని, వీరిని నమ్మి డబ్బులు ఇచ్చి మల్టీపర్పస్ వర్కర్లుగా అక్రమ మార్గంలో చేరిన వారిని తాత్కాలికంగా పని చేయించుకుని ఏ క్షణంలోనైనా వారిని తొలగిస్తారని తెలిపారు. దీని దృష్టిలో పెట్టుకొని ఎవరూ కూడా దళారులకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని ఆయన హెచ్చరించారు.