కో ఆప్షన్ ఉన్నట్లా..? లేనట్లా..?
- గ్రామపంచాయతీల్లో ఆశావహుల నిరీక్షణ
- మున్సిపాలిటీల్లో వరించిన పదవులు
- సర్పంచులు కొలువుదీరి ఆరు నెలలు.. పదవుల ఊసే లేదు
- స్పందించని ప్రభుత్వం.. నిరాశలో కాంగ్రెస్ నేతలు
- జిల్లాలో 2722 మందికి కోఆప్షన్ పదవులకు అవకాశం.
- మున్సిపాలిటీ బోధన్, ఆర్మూర్, భీంగల్ 3 కో ఆప్షన్ నెంబర్లు
బోధన్, జూన్ 26 (విజయక్రాంతి): గ్రామపంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరి ఆరు నెలలు దగ్గర పడుతోంది. నూతన పాలకవర్గాలు కొలువుదీరిన నెలరోజుల్లోనే గ్రామపాలనలో అనుభవజ్ఞులైన వారిని కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకునే ప్రక్రియ చేపడుతారు. మున్సిపాలిటీ ఎన్నికలు ముగిసిన వెంటనే కో-ఆప్షన్ సభ్యులు ఎన్నిక కూడా పూర్తిచేశారు.
కానీ గ్రామపంచాయతీలో మాత్రం కో-ఆప్షన్ పదవులపై ప్రభుత్వం స్పందించకపోవడంతో పదవులపై ఆశలుపెట్టుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు నిరీక్షణతో నిరాశపడుతున్నారు. మరోవైపు గ్రామపంచాయతీలో కోఆప్షన్ సభ్యుల నియామకం ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచుల గెలుపు కోసం పాటుపడి కోఆప్షన్ పదవులపై ఆశలు పెంచుకున్న ఆశావహులు సైతం నిరాశ చెందుతున్నారు. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు గత సంవత్సరం డిసెంబర్లో మూడు విడతల్లో పూర్తి చేశారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 60రోజుల్లోనే గ్రామపంచాయతీలో, 45 రోజుల్లో మున్సిపాలిటీలో కోఆప్షన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. మున్సిపాలిటీల్లో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తిచేశారు. జిల్లాలో 574 గ్రామపంచాయతీలో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లాలో గ్రామపంచాయతీలు, 574 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కొందరు, గెలుపుకు సహకరించామని మరికొందరు కోఆప్షన్ పదవులను ఆశిస్తున్నారు. గ్రామపంచాయతీ నూతన పాలకవర్గాల చుట్టూ తిరగడంతో పాటు ఆయా పార్టీల ముఖ్య నేతల చుట్టూ కోఆప్షన్ పదవుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. పంచాయతీల్లో కోఆప్షన్ పదవుల నియామకాలు మాత్రం సందిగ్ధత ఏర్పడింది.
పంచాయతీకి ముగ్గురు చొప్పున కోఆప్షన్ సభ్యులు
ప్రజల భాగస్వామ్యం పెంపొందించేందుకు స్థానిక పాలకవర్గాల్లో కోఆప్షన్ సభ్యులుగా వివిధ వర్గాల నుంచి ముగ్గురిని ఎన్నుకుంటారు. బోధన్26 ,సాలుర 12,మండలంలో గ్రామపంచాయతీలు ఉండగా కోఆప్షన్ సభ్యులుగా 114 మందికి అవకాశం ఉంటుంది. కోఆప్షన్ సభ్యుల్లో గతంలో గ్రామపంచాయతీలో పాలకవర్గాల్లో పనిచేసిన వారు, ఉద్యోగ విరమణ చేసినవారు, సీనియర్ సిటిజన్లు, ఎన్‌ఆర్‌ఐలు, ఇలా గ్రామాభివృద్ధికి కృషి చేసిన వారిలో ముగ్గురిని సభ్యులుగా ఎన్నుకుంటారు.
గ్రామ సమైక్య అధ్యక్షురాలు ఒకరు ఉంటారు. కోఆప్షన్ సభ్యుడికి వార్డు సభ్యులతో సమాన హోదా, ప్రోటోకాల్ ఉంటుంది. చర్చల్లో పాల్గొనడం సూచనలు ఇవ్వడం చేయవచ్చు. తీర్మానంపై ఓటు వేసే హక్కు వీరికి ఉండదు. గ్రామపంచాయతీలో కోఆప్షన్ సభ్యుల స్థానాల భర్తీకి ప్రభుత్వం ఇంకా ఉత్తర్వులు వెల్లడించకపోయిన గ్రామాల్లో మాత్రం పదవులు దక్కించుకోవడానికి ఆశావహుల ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
సర్కార్ ఆలోచనపై సందిగ్ధం
పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ముగ్గురు కోఆప్షన్ సభ్యులను గ్రామపంచాయతీలో నియామకం చేపట్టాల్సి ఉన్నప్పటికీ సర్కార్ ఆలోచన ఎలా ఉంటుందనే దానిపై ఆశావహుల్లో సందిగ్ధం కూడా నెలకొంది. పంచాయతీ ఎన్నికల ముగిసి దాదాపు ఆరునెలలు దాటిపోతున్నా ఎలాంటి నిర్ణయం వినిపించకపోవడంతో ఎలాంటి మార్పులు జరుగుతాయనే దానిపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేసిన కోఆప్షన్ నియామకం అంశంలో మార్పుల్లోకి మాత్రం వెళ్లలేదు. దీంతో యథావిధిగా ముగ్గురిని కోఆప్షన్ సభ్యులుగా నియమిస్తారని భావిస్తున్నారు.






