27 June, 2026 | 2:08 AM

శవాల దిబ్బగా వెనిజులా

27-06-2026 01:07 AM
  1.   590కి చేరిన మృతుల సంఖ్య
  2.   4,500 మందికి పైగా క్షతగాత్రులు
  3. శిథిలాల కింద ఇంకా వేలాది మంది..
  4. కొనసాగుతున్న సహాయక చర్యలు
  5. సాయం చేసేందుకు ముందుకొచ్చిన భారత్, అమెరికా, ఇరాన్  

కారకాస్, జూన్ 26: లాటిన్ అమెరికా దేశం వెనిజులాలో బుధవారం సాయంత్రం క్షణాల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ విలయంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా, క్షతగాత్రులు వేలల్లో ఉన్నారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి ప్రకోపానికి శుక్రవారం వరకు 590 మంది మృతి చెందినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 4,500 మంది గాయపడ్డారు.

అయితే, భవన శిథిలాల కింద ఇంకా వేలాది మంది చిక్కుకుపోవడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాకుండా ఈ వరుస భూకంపాల వల్ల 40 వేల మంది జాడ తెలియరాలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి.  విపత్తు నేపథ్యంలో భారత్, అమెరికా, ఇరాన్, చైనా, స్పెయిన్, ఫ్రాన్స్ సహా పలు దేశాలు వెనెజులాకు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి.

అతలాకుతలమైన గువేరా..

 భూకంపాల ధాటికి  వెనెజులా రాజధాని కారకాస్ సహా పలు నగరా ల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. అయితే, తీరప్రాంత నగరమైన లా గువేరాలో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. భూకంపాల ధాటికి భవనాలు చాలా వరకు కుప్పకూలాయి. దాంతో వెనిజులా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలను కొనసాగిస్తోంది.

ఇక్కడ 100కు పైగా భవనాలు నేలమట్టమైనట్లు సహాయక చర్యల్లో పాల్గొన్న ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు తెలిపారు. వీటి కింద చిక్కుకున్న వారిని గుర్తించడం కష్టతరంగా మారిందని పేర్కొన్నారు.  దేశవ్యాప్తంగా దాదాపు 250 బహుళ అంతస్తుల భవనాలు శిథిలాల దిబ్బగా మారినట్లు తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ వెల్లడించారు. 

భారత ప్రధాని మోదీ దిగ్భ్రాంతి 

వెనిజులా భూకంపంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అన్ని విధాలా సాయం అందించడానికి  సిద్ధంగా ఉన్నామని‘ఎక్స్’వేదికగా ప్రకటించారు.క్షతగా త్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. 

* తక్షణ రెస్క్యూ ఆపరేషన్ కోసం 

అమెరికా ప్రభుత్వం 150 మిలియన్ డాలర్ల అత్యవసర సాయం ప్రకటించింది. దాంతో పాటు రెండు యుద్ధ నౌకలు, రవాణా విమానాలు, హెలికాప్టర్లను సహాయక చర్యల కోసం పంపుతున్నట్లు తెలిపింది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో మాట్లాడుతూ అత్యంత వేగంగా, సమర్థంగా వెనిజులాకు సహాయం అందిస్తామని చెప్పారు. 

* ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్సీ వెనిజులాకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. 

* చైనా కూడా సహాయం అందిస్తామని ప్రకటించింది. 

* స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జర్మనీ ఛాన్సలర్ ఫెడ్రిచ్ మొర్జ్ సానుభూతి ప్రకటించారు. అవసరమైన సహాయం చేస్తామని తెలిపారు.

* బ్రెజిల్, మెక్సికో, కొలంబియా, కెనడా మరియు ఐక్యరాజ్యసమితి తమ రెస్క్యూ బృందాలను, అత్యవసర వైద్య సామగ్రిని వెనెజులాకు తరలిస్తున్నాయి.

విదేశీ సహాయక బృందాల రాకకు ఇబ్బందులు

భూకంపంలో వెనెజులా రాజధాని కారకాస్ విమానాశ్రయం తీవ్రంగా దెబ్బతింది. దాంతో విదేశాల నుంచి సహాయక బృందాలు రావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి.  శిథిలాలు పూర్తిగా తొలగించిన తర్వాత మృతుల సంఖ్యపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  

‘ఎక్స్’పై ఆంక్షల తొలగింపు

భూకంపం నేపథ్యంలో సామాజిక మాద్యమాలపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు వెనెజులా ప్రభుత్వాన్ని కోరారు. అందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ప్రజలకు ‘ఎక్స్’అందుబాటులోకి వచ్చింది. 2024లో మదురో అధికారంలో ఉన్నప్పుడు ఈ మైక్రోబ్లాగింగ్ సైట్‌ను నిషేధించింది. 

శిథిలాల్లో శిశువు జననం  

వెనిజులాలో ఎక్కడ చూసినా కూలిన భవనాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలు, మరణాలు మిగిల్చిన మాటలంకదని విషాదం. ఇంతటి మహా విధ్వంసం మధ్య ఒక అద్భుతం చోటు చేసుకుంది. భూకంపం ధాటికి స్థానిక ఆసుపత్రులు కూలిపోవడంతో పాటు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. కనీస వైద్య పరికరాలు కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఓ గర్భిణికి ప్రసవ వేదన మొదలైంది.

అయితే.. అక్కడున్న తోటి భూకంప బాధితులు  ఆమెకు ధైర్యం చెబుతూ ప్రసవం జరిగేలా చూశా రు. ఎలాంటి మెడికల్ సపోర్ట్ లేకుండానే ఆ తల్లి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడి యో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భూకం పం కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా.. అదే భూ కంపం మధ్యలో ఒ క ప్రాణం పోసుకోవడం దేవుడి దయేనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.