మా నీళ్లు కొనాల్సిందే..?
- సొంత బ్రాండ్లు.. ఇష్టానుసారం ధరలు..
- హోటళ్లు, రెస్టారెంట్లలో నీళ్ల బాటిళ్లపై దోపిడీ
- ఒక్కో బాటిల్‌పై రూ.30 నుంచి రూ.40 వరకు వసూలు
- వినియోగదారులకు అంటగడుతున్న యజమానులు
- చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు
- ప్రముఖ బ్రాండ్ల ధర లీటరు రూ.20 లోపే..
మేడ్చల్, జూన్ 26 (విజయక్రాంతి): హోటళ్లు, రెస్టారెంట్లలో సొంత బ్రాండ్ల వాటర్ బాటిళ్లు తయారు చేయించి.. ఇష్టానుసార ధరలకు విక్రయిస్తూ కస్టమర్లను నిలువునా దోచుకుంటున్నారు. ఐఎస్‌ఐ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తింపు లేకున్నప్పటికీ అక్రమంగా విక్రయిస్తున్నారు.
బహిరంగ మార్కెట్లో ఐఎస్‌ఐ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తింపు ఉన్న ప్రముఖ కంపెనీ లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.15 నుంచి రూ.20లకు దొరుకుతున్నాయి. వీటిని అందుబాటులో ఉంచకుండా, సొంత బ్రాండ్లను అధిక ధరలకు అంటగడుతున్నారు. ప్రముఖ కంపెనీల వాటర్ బాటిల్‌ను అడిగితే లేవు అని చెబుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. నిబంధనల ప్రకారం కస్టమర్లకు రెస్టారెంట్లు, హోటల్లో స్వచ్ఛమైన నీరు ఉచితంగా అందించాలి. కానీ స్వచ్ఛమైన నీరు ఇవ్వకుండా అధిక ధరలకు సొంత బ్రాండ్ల నీటిని ఇస్తున్నారు. అంతేగాక వీటిపై అదనంగా జీఎస్‌టీ, సీఎస్‌టీ వసూలు చేస్తున్నారు.
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, ఐఎస్‌ఐ మార్క్ లేకుండా విక్రయాలు
హోటళ్ళు, రెస్టారెంట్లలో సొంత బ్రాండ్ల వాటర్ బాటిల్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, ఐఎస్‌ఐ మార్కు లేకుండా విక్రయిస్తున్నారు. ఇవి లేకుండా వాటర్ బాటిల్ విక్రయించడం నిబంధనలకు విరుద్ధం. తప్పనిసరిగా రెండింటి గుర్తింపు, లోగో లైసెన్స్ నెంబర్ ఉండాలి. అంతేగాక క్రషుడ్ వాటర్ బాటిల్ అని కూడా ఉండాలి. లేబుల్ మీద ఇతర విషయాలు ముద్రించకూడదు. కొన్ని హోటల్ వారు బాటిల్ పరిమాణం ఎంతో ముద్రించడం లేదు. మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ పూర్తిగా ఉండడం లేదు.
ప్రముఖ బ్రాండ్ల ధరలు రూ.15 నుంచి రూ.20 ఉంటే, హోటల్ వారు సొంత బ్రాండ్లపై ఇష్టానుసారంగా రూ.50 ఎంఆర్‌పీ అని ముద్రిస్తున్నారు. ఇలా చేయడం లీగల్ మెట్రాలజీ రూల్ కింద అను ఫెయిర్టేర్ ప్రాక్టీస్ అవుతుంది. ప్రముఖ బ్రాండ్లుగా తీరందిన టాటా, బిస్లరీ, కిన్లి లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.20 ఉన్నప్పుడు రెస్టారెంట్లు హోటలలో రూ.50 ముద్రించడం కస్టమర్లను దోచుకోవడమే అవుతుంది.
చోద్యం చూస్తున్న అధికారులు
హోటళ్ల్లు, రెస్టారెంట్లలో సొంత బ్రాండ్లతో నిబంధనలకు విరుద్ధంగా వాటర్ బాటిళ్లు విక్రయిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఐఎస్‌ఐ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లేకుండా వాటర్ బాటిల్ విక్రయించడం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ కింద నేరం. చిన్న పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో నిబంధనలకు విరుద్ధంగా వాటర్ బాటిళ్లు విక్రయిస్తున్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు. ప్రధాన అర్హదారుల మీద ఉన్న డాబా హోటళ్లలో కూడా సొంత బ్రాండ్ల వాటర్ బాటిళ్ల్లు విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.






