27 June, 2026 | 1:14 AM

‘శాతవాహన’లో మరో వివాదం

27-06-2026 12:00 AM
  1. పరీక్ష కేంద్రం ఒకచోట.. రాసేది మరోచోట
  2. నచ్చిన చోట పరీక్ష రాసి, పేపర్లు ఇన్విజిలేటర్లకు అందజేత
  3. యూనివర్సిటీ అధికారులు, యాజమాన్యాల కుమ్మక్కు!
  4. ఏప్రిల్‌లో జరిగిన డిగ్రీ సెమిస్టర్స్‌లో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీతో ఒప్పందం
  5. పంపకాల్లో తేడాతో తెరపైకి?
  6. విచారణ కమిటీ వేసి చర్యలు తీసుకుంటామన్ని యూనివర్సిటీ అధికారులు 

కరీంనగర్, జూన్ 26 (విజయక్రాంతి): కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో మరో వివాదం తెరపైకి వచ్చింది. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ నెలలో జరిగిన డిగ్రీ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ ల్లో డిగ్రీ కళాశాలలో జరిగే పరీక్షలలో యూనివర్సిటీలోని కొంతమంది అధికారులు ప్రైవేట్ కళాశాలల్లో పనిచేసే సిబ్బంది, యజమాన్యాలతో కలిసి ఒక కొత్త సంస్కృతికి తెరలేపారు.

కరీంనగర్ పట్టణ కేంద్రంలోని ఒక ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో పరీక్షలు జరుగుతున్నప్పుడు పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసే విద్యార్థి హాజరు ఉంటుంది, కానీ ఆ విద్యార్థి ఆ పరీక్ష కేంద్రంలో కాకుండా తనకు నచ్చిన చోట పరీక్ష రాసి, ఆ పేపర్‌ను సదరు కాలేజీ ఇన్విజిలేటర్లకు ఇచ్చి, ఇందులో కలుపుతారు. ఎగ్జామ్ హాల్‌లో ఉండే ఇన్విజిలేటర్లు కూడా మౌనంగా ఉంటున్నారు. ఇదంతా కూడా యూనివర్సిటీలోని కొంతమంది కనుసన్నల్లో జరుగుతుంది.

అయితే వారి మధ్య పైసల పంపకంలో వచ్చిన తగాదాలతో ఈ విషయం బయటకు పొక్కింది. యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి మాత్రం తమ దృష్టికి రాలేదని, అవకతవకులు జరిగితే ఒక కమిటీ వేసి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్షలు జరిగి మూడు నెలల సమయం కావస్తుండగా, అసలు యూనివర్సిటీ పరీక్షల విభాగంలో ఏమి జరుగుతుంది? ఇద్దరు ముగ్గురు వ్యక్తుల చర్యలతో యూనివర్సిటీ పాలన గాడి తప్పిందని చర్చించుకుంటున్నారు.

యూనివర్సిటీ అధికారులకు అంతా తెలిసినా కూడా కావాలనే ఆ ప్రైవేట్ కళాశాలను కాపాడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒక్క కళాశాలలోనే ఇలా జరిగిందా ఇంకా బయటపడని ప్రవేట్ కళాశాలలు ఉన్నాయా ? ఒకటి రెండు కళాశాలలు తప్పితే మిగతా అన్ని కళాశాలలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్టు పరీక్షలు రాసిన చాలామంది విద్యార్థులు గుసగుసలాడుతున్నారు. 

విద్యార్థుల తల్లిదండ్రులు మా పిల్లలు బాగా చదివి పరీక్షలు రాసి పాస్ అవుతుంటే  కొంతమంది యూనివర్సిటీ అధికారులు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో, అందులో పని చేసే సిబ్బందితో కుమ్మక్కై విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తున్నారని ఆందోళన పడుతున్నారు. కష్టపడి చదివి రాసిన దానికి ఫలితం లేకుండా పోతుంది  విద్యార్థులు వాపోతున్నారు.

యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోవాలి

యూనివర్సిటీ అధికారులు విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికైనా సదరు కాలేజీని గుర్తించి, యూనివర్సిటీ గుర్తింపు రద్దుచేయాలి. ఏ కళాశాలలో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం.

 చుక్క శ్రీనివాస్,

శాతవాహన యూనివర్సిటీ ఇన్‌చార్జి,

బీఆర్‌ఎస్వీ