ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి
- మెట్రో పేరుతో 12 వందల కోట్లు లంచం తీసుకున్న రేవంత్, కిషన్‌రెడ్డి
- టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
- విలీనం చేయాలని సంపత్ ఆమరణ నిరాహార దీక్ష
- పరామర్శించిన తీన్మార్ మల్లన్న
మల్కాజిగిరి, జూన్ 26 (విజయక్రాంతి): ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని వెంటనే అపాయింటెడ్ డేట్ ప్రకటించాలని డిమాండ్‌తో మల్కాజిగిరిలోని తన స్వగృహంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన బహుజన్ వర్కర్స్ యూనియన్ చైర్మన్ సంపత్ ముదిరాజ్‌ను రెండో రోజైన శుక్రవారం టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలిసి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆర్టీసీ అనుబంధ యూనియన్ అయిన బహుజన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించి సంస్థను విలీనం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆర్టీసీలో ఉన్న 35 వేల మంది కార్మికులు, వారి కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపడమే బహుజన్ వర్కర్స్ యూనియన్ ఏకైక లక్ష్యమమని, ఆర్టీసీకి యూనియన్ ఎన్నికలు ఏమాత్రం అవసరం లేదని, విలీనం మాత్రమే కార్మికుల బతుకులను మార్చే శాశ్వత పరిష్కారం అని స్పష్టం చేశారు. విలీనం దస్త్రం మీద ముఖ్యమంత్రి సంతకం చేస్తే, ఏకంగా తమ యూనియన్ ను రద్దు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మల్లన్న ప్రకటించారు.
సంపత్ ముదిరాజ్, కుమార్ తమ ఇంట్లోనే చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తాము సంపూర్ణ సంఘీభావం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ దీక్ష కేవలం ఇద్దరిది కాదని, 35 వేల మంది ఆర్టీసీ కార్మికులది మరియు సబ్బండ జాతుల దీక్ష అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన మాట నిజం కాదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లను సూటిగా ప్రశ్నించారు.
ఎవరూ అడగకపోయినా, కనీసం ధర్నాలు చేయకపోయినా మెట్రో రైలును ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మెట్రో ప్రాజెక్టులో రూ. 12 వేల కోట్ల ప్రాజెక్టును రూ.15 వేల కోట్లకు పెంచి, అందులో సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కలిసి ఎల్ అండ్ టీ నుండి రూ.1200 కోట్లు లంచంగా తీసుకున్నారని ఆరోపించారు.
గతంలో కేసీఆర్ కూడా ఆర్టీసీ కార్మికులు 52 రోజులు సమ్మె చేసినా, ప్రాణాలు కోల్పోయినా పట్టించుకోలేదని, దాని ఫలితంగానే అధికారం కోల్పోయి కింద పడ్డారని గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూడా ఆర్టీసీ కార్మికులను విస్మరిస్తే కేసీఆర్కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. తక్షణమే విలీనం తేదీ ప్రకటించాలని లేదంటే డిపోల ముట్టడి చేస్తామని హెచ్చరించారు. మల్లన్న వెంట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజని కుమార్ యాదవ్ ఉన్నారు.






