బొబ్బిలి చెరువులో పడి యువకుడు మృతి
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలంలోని బొబ్బిలి చెరువులో పడి యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామేశ్వర్‌పల్లి గ్రామానికి చెందిన జిల్లెల బాలమణి, చిన్న రాంరెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో రెండో కుమారుడు జిల్లెల బాపిరెడ్డి (25) కాగా, అతని తండ్రి కొన్ని సంవత్సరాల క్రితమే మృతి చెందాడు. ఈ నెల 7న సాయంత్రం పొలం నుంచి తీసుకొచ్చిన వడ్లను ఆరబెట్టే విషయంలో తల్లితో బాపిరెడ్డికి వాగ్వాదం జరిగింది.
పని చేయడం చేతకాదని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన బాపిరెడ్డి ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం భిక్కనూర్ గ్రామ శివారులోని బొబ్బిలి చెరువులో అతని మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై డి. ఆంజనేయులు తెలిపారు.






