4 August, 2026 | 1:31 AM

మీ సేవలను పటిష్టం చేయాలి

04-08-2026 12:25 AM
  1. టీ-ఫైబర్‌ను గడువులోగా పూర్తి చేయాలి
  2. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల సమావేశంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజయ్ జాజు

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో మీ సేవ కేంద్రాలను మరింత పటిష్టపరిచి, ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. టీ౨-ఫైబర్ పనులను  గడువులోగా పూర్తి చేయాన్నారు. సోమవారం సచివాలయంలో ప్రపంచ బ్యాంక్ గ్రూప్‌నకు చెందిన డిజిటల్ పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్ చందానీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో ప్రధానకార్యదర్శి సమావేశమయ్యారు.

సమావేశంలో డిజిటల్ ఇండియా, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనలో భాగంగా రాష్ట్రంలో మీ సేవ కేంద్రాల ఆధునీకరణ, భారత్ ఫ్యూచర్ సిటీలో కొత్త డేటా సెంటర్ల ఏర్పాటు కోసం మౌలిక సదుపాయాల కల్పన, కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రత, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యువతకు ఐటీ ఆధారిత ఉపాధి అవకాశాల విస్తర ణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్ రంగంలో అమలు చేస్తున్న సంస్కరణలను ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అభినందించారు.

దేశంలో డిజిటల్ రంగంలో పెట్టుబడులకు హర్యానా, తెలంగాణ రాష్ట్రాలు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడుల కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. అలాగే టీ ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో ప్రధానకార్యదర్శి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. టీ-ఫైబర్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దూరిశెట్టి, టీ ఎండీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు

 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా, గౌరవప్రదంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం ముందుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని సైనిక్ స్మారక్ వద్ద అమరవీరులకు పుష్పాంజలి ఘటిస్తారని, అనంతరం గోల్కొండ కోటలోని రాణీ మహల్ లాన్స్‌లో నిర్వహించే వేడుకలకు హాజరవుతారని తెలిపారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించి, ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు.