ప్రశాంత్ కిశోర్ అఖండ విజయం
- బంకీపూర్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి నీరజ్‌పై గెలుపు
- 19,324 ఓట్ల మెజార్టీ కైవసం
- ఎన్నికల బరిలో జన సురాజ్ పార్టీ బోణీ
- ఎమ్మెల్యేగా ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ రాజీనామాతో బై పోల్
- మధ్యప్రదేశ్‌లోని దతియా, గుజరాత్‌లోని మంజల్‌పూర్ ఉప ఎన్నికల ఫలితాలూ విడుదల
- దతియాలో కాంగ్రెస్ అభ్యర్థి ఘన్‌శ్యామ్ విజయం
- మంజల్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి సతీష్ పటేల్ గెలుపు
పాట్నా, ఆగస్టు ౩: రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ (పీకే) ప్రత్యక్ష రాజకీయాల్లో సంచలన విజయాన్ని నమోదు చేశారు. బీహార్‌లోని బంకీపూర్ ఉప ఎన్నిక ఫలితాల్లో ఆయన గెలుపొందారు. తద్వారా ఆయన బీహార్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగు పెట్టనున్నారు.
మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ అసెంబ్లీ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 19,324 ఓట్ల ఆధిక్యంతో పీకే విజయం సాధించారు. ఎన్నికల బరిలో జన సురాజ్ పార్టీకి మొట్టమొదటి విజయం ఇదే కావడం విశేషం. ఓటమిపై సీఎం సామ్రాట్ చౌదరి స్పందిస్తూ.. ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే, ప్రశాంత్ కిశోర్‌కు అభినందనలు తెలిపారు. మరోవైపు, బీజేపీకి అత్యంత పట్టున్న అసెంబ్లీ స్థానంలో పీకే గెలుపొందడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటైనా సంపాదించని జన సురాజ్ పార్టీ, తమ పార్టీకి కంచుకోట అయిన బంకీపూర్‌లో విజయం సాధించడంపై బీజేపీ నేతలు విస్మయానికి గురవుతున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి ప్రస్తుత పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో నియోజకవర్గంలో అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో ఓడిన నీరజ్‌కుమార్ సిన్హా అనే వ్యక్తి నబీన్ చిన్ననాటి స్నేహితుడే.
బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: ప్రశాంత్ కిశోర్
తన గెలుపు కేవలం ఒక ఎమ్మెల్యే సీటు దక్కించుకోవడమే కాదని, బీజేపీ నాయకత్వానికి బంకీపూర్ ప్రజలిచ్చిన స్పష్టమైన సందేశమని ప్రశాంత్‌కిశోర్ అభివర్ణించారు. 30 ఏళ్ల బీజేపీ కంచుకోటను, తాము ౩౦ రోజుల్లోనే తునాతునకలు చేశామని హర్షం వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక ఫలితాల తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం సామ్రాట్ చౌదర్‌తోపాటు బీజేపీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కుల మత రాజకీయాలను దాటి, ఇప్పుడు బీహార్ ప్రజలు స్పష్టమైన మార్పు కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. నేరచరిత్ర ఉన్న వ్యక్తిని సీఎం పీఠం నుంచి దింపేయాలని ప్రజలు చూస్తున్నారని సీఎం సామ్రాట్ చౌదరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర యువత జీవితాలు మారాలన్నా, వారి భవిష్యత్తు బాగుండాలన్నా, సచ్ఛీలురైనా ముఖ్యమంత్రి వల్లే అవుతుందని పేర్కొన్నారు. గుజరాత్ తరహాలోనే బీహార్ అభివృద్ధి చెందాలంటే, రాష్ట్రానికి మరిన్ని మౌలిక వసతులు, పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని, అది జరిగితేనే రాష్ట్రం నుంచి వలసలు ఆగిపోతాయని అభిప్రాయపడ్డారు.
కేవలం ౧౫,౦౦౦ కోసం కుటుంబాన్ని వదిలి, పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితులు మారాలన్నారు. తన పోరాటం ఏ ఒక్కరిపైనో కాదని, బీజేపీ, ఎన్డీయే కూటమి విధానాలపైనేనని స్పష్టం చేశారు. కేంద్రం అన్ని సదుపాయాలు, నిధులు గుజరాత్‌కే ఇస్తే, ఇక బీహార్ వంటి వెనుకబడిన రాష్ట్రాల పరిస్థితి ఏంటని నిలదీశారు. తాను ఎమ్మెల్యే అవ్వగానే బంకీపూర్ ఇక రేపో మాపో బెంగళూరు అయిపోదని చమత్కరిస్తూనే, నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని ముక్తాయించారు.
ప్రశాంత్ కిశోర్ నేపథ్యం..
కెరీర్ తొలిరోజుల్లో పీకే ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో ప్రజారోగ్య నిపుణుడిగా సేవలందించారు. 2014లో భారత్‌కు వచ్చి పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థ ఐ-ప్యాక్‌ను స్థాపించారు. ఇదే ఏడాది బీజేపీకి వ్యూహకర్తగా పనిచేశారు. తర్వాత 2015లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్ బంధన్ విజయం కోసం పనిచేశారు.
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం కోసం వ్యూహరచన చేశారు. తర్వాత వరుసగా ఢిల్లీలో ఆప్, తమిళనాడులో డీఎంకే, బంగాల్‌లో టీఎంకే విజయం కోసం పనిచేశారు. 2021లో వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. జన్ సురాజ్ పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గతేడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనేకచోట్ల పోటీ చేసినప్పటికీ, ఎలాంటి విజయాన్నీ సాధించలేదు. నాడు పీకే ఎన్నికల బరికి దూరంగా ఉన్నారు. బంకీపూర్ ఉప ఎన్నికలో పోటీ చేసి విజయ బావుటా ఎగురవేశారు.
మరో రెండు స్థానాల్లోనూ ఫలితాలు
బీహార్‌లోని బంకీపూర్‌తో పాటు మధ్యప్రదేశ్‌లోని దతియా, గుజరాత్‌లోని మంజల్‌పూర్ ఉప ఎన్నికల ఫలితాలు కూడా విడుదలయ్యాయి. దతియాలో కాంగ్రెస్ అభ్యర్థి ఘన్‌శ్యామ్ సింగ్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీ ఓటమిపాలయ్యారు. మంజల్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి సతీష్ పటేల్ గెలిచారు. కాంగ్రెస్ నేత జయాబెన్ రబారీ ఓడారు.






