ఆదిమ గిరిజనుల సొంత ఇంటికల నెరవేరేనా..
- అడవి శాఖ అధికారులు అడ్డంకుతో నిలిచిపోయిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు..
- ప్రజా ప్రతినిధులు.. అధికారులు హామీలు ఇస్తున్నా ముందుకు సాగని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు..
- కొలం గుడాలలో గుంతలకే పరిమితమైన పక్క గృహాల నిర్మాణ పనులు..
ఉట్నూర్, ఆగస్టు 3 : గూడు లేని ఆదిమ గిరిజనుల సొంత ఇంటి కల నెరవేరడం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ పథకంలో ఆదిమ గిరిజన తెగలు అయిన కొలం, తోటి, కోయ తదితర జాతి గిరిజనులను గుర్తించి ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన ఆదిమ తెగ గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించి సొంతంగా గుంతలు చదువుకున్నారు.
ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించిన సమయంలో అడవి శాఖ అధికారులు మారుమూల గిరిజన గ్రామాలకు చేరుకొని కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో మీ గ్రామాలు ఉన్నాయని పక్కా గృహాలు నిర్మించుకొనుటకు అనుమతి లేదని అడుగు శాఖ అధికారులు అడ్డుకున్నారు. పక్కా గృహాలను నిర్మించుకునే సమయంలో అడవి శాఖ అధికారులు అడ్డుకోవడంతో గిరిజనులు ఐటిడిఏ కార్యాల యం ముందు పలుసార్లు ధర్నాలు చేసి అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు.
ఆ సమయంలో సమస్యను పరిష్కరి స్తామని హామీలు ఇచ్చినా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. ఎన్నో ఏళ్ల తర్వాత తమకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని సంతోషపడిన లబ్ధిదారుల ఆశలపై అడవి శాఖ అధికారులు అడ్డుకోవ డంతో ఆదిమ గిరిజనులు నిరాశలో ఉన్నారు. పక్కా గృహాలు నిర్మించుకోవద్దని అడవి శాఖ అధికారులు జారీ చేస్తున్నారని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏజెన్సీలో నిలిచిపోయిన 580 గృహాలు
ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఉట్నూర్, కడెం, ఇంద్రవెల్లి తదితర మండలాల్లో ఆదిమ గిరిజనులకు మంజూరు చేసిన 580 గృహాలు గుంతలకే పరిమితమయ్యాయి. ఉట్నూర్ మండలంలోని కుమ్మరి కుంట గ్రామంలోని కొలం గిరిజనులకు 63 పక్కా గృహాలు మంజూరు చేశారు. మంజూరైన గృహాలను నిర్మించుటకు పిల్లర్ల గుంతలు తవ్వుకొని పనులు ప్రారంభించగానే అడవి శాఖ అడ్డుకున్నారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి గుంతల్లో నీరు నిలిచి పోయిందీ. గుంతల్లో నిలిచిన నీటిలో ఆత్రం భీమేశ్వరి (3) పాప పడి తీవ్ర గాయాలయ్యింది.
- కడప బాపురావు, కుమ్మరి కుంట
కోర్ ఏరియా పేరుతో నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు
ప్రభుత్వం మంజూరు చేసిన పక్క ఇండ్లను నిర్మించుకునే సమయంలో కవ్వాల్ టైగర్ జోన్ లో మీ గ్రామాలు ఉన్నాయని, ఈ గ్రామాలు టైగర్ జోన్ లోని కోర్ ప్రాంత ఏరియాగా గుర్తించడం జరిగిందంటూ అడవి శాఖ అధికారులు ఇండ్ల నిర్మాణాన్ని అడ్డుకున్నారు. పాత గుడిసెలను తీసి ఇండ్ల నిర్మాణానికి గుంతలు తవ్వుకొని నిర్మాణం పనులు ప్రారంభించగానే అడవి శాఖ అధికారులు వచ్చి పనులను అడ్డుకున్నారని వాపోయారు.
తమ గ్రామానికి రాష్ట్ర మంత్రితో పాటు ఎం ఎల్ ఎ, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు సైతం వచ్చి తమకు న్యాయం చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమ గూడెంతో పాటు బీరుసాయిపేట్, ధర్మాజీపేట్, చెరువు గూడ, మారుతి గూడతో పాటు చాలా గ్రామాలు ఇండ్ల నిర్మాణాలు ఎప్పుడు ప్రారంభమవుతాయని లబ్ధిదారులు ఎదురు చూస్తు న్నారు.
మాడవి రమేష్, కుమ్మరి కుంట, ఉట్నూర్ మండలం






