చిత్తడి నేలల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్,(విజయక్రాంతి): చిత్తడి నేలలతో (వెట్ ల్యాండ్స్) అనేక పర్యావరణ ప్రయోజనాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జిల్లాలో చిత్తడి నేలల గుర్తింపుకు సంబంధించి, సంబంధిత అధికారులతో కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో, బుధవారం సాయంత్రం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో ఉన్న చిత్తడి నేలలను శాస్త్రీయంగా గుర్తించి, వాటిని అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ ప్రక్రియలో భాగంగా అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి, సంయుక్తంగా క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించాలని సూచించారు. చిత్తడి నేలల వల్ల భూగర్భ జలమట్టం పెరగడమే కాకుండా, జీవవైవిధ్యం పెంపొందుతుందని, వీటిని గుర్తించి, కాపాడుకోవడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. జిల్లాలో గుర్తించిన చిత్తడి నేలలను కేవలం పర్యావరణ కోణంలోనే కాకుండా, పర్యాటక కేంద్రాలుగా కూడా తీర్చిదిద్దే అవకాశం ఉంది.
తద్వారా జిల్లా అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్, అటవీ శాఖాధికారి (డిఎఫ్ఓ) సుశాంత్ సుఖదేవ్ బోబడే, ఆర్డీవో రత్నకళ్యాణి, డిఆర్డిఓ విజయలక్ష్మి, డిపివో శ్రీనివాస్, జెడ్పీ సీఈవో శంకర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.




