గోదాముల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, మే 7 (విజయక్రాంతి) : వరి ధాన్యం నిల్వచేసే గోదాముల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని కాసిపేట మండలం గుండ్లపహాడ్, బెల్లంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం నిల్వ గోదాములను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, బెల్లంపల్లి తహసిల్దార్ కృష్ణ లతో కలిసి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు నగదు చెల్లింపు త్వరగా పూర్తి చేయాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కొనుగోలు పూర్తి చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతుల వద్ద నుంచి తీసుకున్న ధాన్యాన్ని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గోదాములలో నిబంధనల ప్రకారం నిల్వ చేయాలన్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు 10 రైస్ మిల్లులు పని చేస్తున్నాయని, సుముఖ్ గోదాం సామర్థ్యం 20 వేల మెట్రిక్ టన్నులు ఉండగా, ఇతర గోదాముల సామర్థ్యం మొత్తం 61 వేల మెట్రిక్ టన్నులుగా ఉందని తెలిపారు. ఈ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగిస్తూ నిల్వలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
జిల్లాలో మిల్లింగ్ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, రవాణా వాహనాలను మిల్లులకు తగిన విధంగా కేటాయించి, వరి ధాన్యం రవాణా, అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి అంతరాయాలు రాకుండా, హమాలి సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.






