4 July, 2026 | 2:03 AM

జూపల్లీ.. నీకు చీము నెత్తురుందా?

04-07-2026 01:04 AM
  1. అప్పులపై సవాల్ విసిరి తోక ముడిచావు
  2. ఇప్పుడేమో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు రా అంటున్నావు
  3. అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పింది ఎవరు?
  4. గోల్ కొడదామని సెల్ఫ్‌గోల్ చేసుకున్నారు
  5. దమ్ముంటే పదవికి రాజీనామా చెయ్
  6. మంత్రి జూపల్లిపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్

సంగారెడ్డి, జూలై 3 (విజయక్రాంతి) : ‘జూపల్లి.. బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్ర అప్పులపై చర్చకు సవాల్ విసిరావు. చివరికి చర్చకు రాకుండా తోకముడిచావు. నీకు నిజంగా చీము, నెత్తురు ఉంటే వెంటనే మంత్రి పదవికి రాజీనామా చెయ్’ అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. శుక్రవారం సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం, సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

మంత్రుల అబద్దాలను, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ‘మొన్న సవాల్ విసిరి, నిన్న తోక ముడిచి నాకు వాట్సాప్‌లో ఒక ఉత్తరం పెట్టిండు. పూటకో సవాలు, రోజుకో అడ్రస్ లెక్క ఉంది జూపల్లి సంగతి. మొదలేమో తెలంగాణ భవన్ అన్నడు, తర్వాత అమరవీరుల స్థూపం అన్నడు.. ఇప్పుడేమో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ అంటున్నాడు’ అని విమర్శించారు. 2023 డిసెంబర్ నుండి 2026 జూన్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్బీఎం కింద తెచ్చిన అప్పు రూ.1,86,087 కోట్లు అయితే.. ఆయన నాకు రాసిన ఉత్తరంలో రూ.1,77,058 కోట్లు అని చెప్తుండు.

మరి ఆ రూ.10 వేల కోట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. మార్చి 18, 2026 నాడు అసెంబ్లీలో నేను గట్టిగా నిలదీస్తే రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మా ప్రభుత్వం 27 నెలల్లో చేసిన అప్పు రూ.3,47,294 కోట్లు అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. ఇందులో ఏది నిజమో చెప్పాలన్నారు. నాలుగు నెలల కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది నిజమా? మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పింది నిజమా? అని ప్రశ్నించారు.

నువ్వు కాదు, మీ ముఖ్యమంత్రి, ఆర్ధికమంత్రి, మొత్తం మీ క్యాబినెట్‌ను కూసోబెట్టి నిండు అసెంబ్లీలో బీఆర్‌ఎస్ చేసిన అప్పు 4 లక్షల కోట్లే అని నిరూపించి మీ అబద్ధాలను కడిగి పారేశానని చెప్పారు. కాగ్ రిపోర్టు కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 4.15 లక్షల కోట్లు అని అసెంబ్లీలో చెప్పిందని గుర్తు చేశారు. అప్పులపై కాంగ్రెస్ మంత్రులు గోల్ కొడుదాం అనుకుంటే సెల్ఫ్ గోల్ అయిపోయింది. ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ మొదలు పెట్టండ్రు. అందులో కూడా పప్పులో కాలు వేశారని ఎద్దేవా చేశారు. 

సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల గురించి ఏనాడైనా మాట్లాడారా?

సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల గురించి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కరోజైనా మాట్లాడారా? అని హరీశ్‌రావు నిలదీశారు. మీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు ఇస్తున్నారని.. మా సంగారెడ్డి జిల్లాకు, మా రైతులకు ఉపయోగపడే సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు ఎందుకు నిధులివ్వడం లేదని ప్రశ్నించారు. నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని, లేకపోతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు, పాదయాత్రలు చేపడుతామని హెచ్చరించారు.

అదే విధంగా సంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్‌కు తాగునీరు అందించే సింగూరు ప్రాజెక్టు మరమ్మతులు తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు ఉన్న భూములనే లాక్కుంటుందని   ఆరోపించారు. ఒక్క సంగారెడ్డిలోనే 700 ఎకరాలు, రాష్ట్రవ్యాప్తంగా 50 వేల ఎకరాల అసైన్డ్ భూములను లాక్కునే కుట్ర జరుగుతోందన్నారు.

ఎకరం రూ. 3 కోట్లు ఉంటే రూ. 40 లక్షలు ఇస్తామని గిరిజనులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మూసీ సుందరీకరణ పేరుతో హడావుడి చేస్తున్న ప్రభుత్వం మల్లన్నసాగర్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు తాగునీరు, మూసీకి నీళ్లు వెళ్తున్నాయంటే కేసీఆర్, బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన కృషేనని పేర్కొన్నారు. కేసీఆర్ ఆశీర్వాదంతో  సదాశివపేట నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు తీసుకొచ్చామని హరీశ్‌రావు పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ హయాంలో మంజూరైన ఎస్డీఎఫ్ నిధులను వెనక్కి తీసుకుందని ఆరోపించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, శశిధర్‌రెడ్డి, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.