4 July, 2026 | 2:15 AM

రామమందిర విరాళాల చోరీ బాధాకరం

04-07-2026 01:14 AM

నిధుల దుర్వినియోగం భక్తుల మనోభావాలను గాయపరిచింది..

  1. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి 
  2. ఆలయ నిర్వహణలో మరింత పారదర్శకత రావాలి 
  3. నిధుల విషయంలో జవాబుదారీతనం ఉండాల్సిందే 
  4. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె

న్యూఢిల్లీ, జూలై ౩: అయోధ్య రామ మందిర విరాళాలు చోరీకావడం చాలా బాధాకరమని, ఇది భక్తుల మనోభావాలను గాయపరిచిందని (ఆర్‌ఎస్‌ఎస్) స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె విచారం వ్యక్తంచేశారు. రామ మందిరమంటే, కేవలం ఒక ఆలయం కాదని, వందల ఏళ్ల నుంచి హిందువుల విశ్వాసాలకు, నమ్మకాలకు ప్రతీక అని ఆయన అభివర్ణించారు. ఎన్నోతరాల భక్తుల త్యాగాలు, బలిదానాలతోనే ఆలయ నిర్మాణ కల సాకారమైం దంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

అంత పవిత్రమైన చోట విరాళాలు దుర్వినియోగం కావడం తమను కలచివే సిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. న్యూఢిల్లీ నుంచి శుక్రవారం ఆయన ఓ వీడియో ద్వారా స్పందిస్తూ.. ఆలయ నిధులు మళ్లించిన వారిపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవస రం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయ నిర్వహణలో మరింత పారదర్శకత రావాలని, నిధుల విషయంలో పూర్తి జవాబు దారీతనం తీసుకురావాల్సి ఉందని డిమాండ్ చేశారు.

ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ద్వారా సమగ్ర దర్యాప్తు పూర్తయిన తర్వాత, దోషులుగా తేలినవారికి కోర్టులు కఠినమైన శిక్షలు విధించేలా చూడాల్సి ఉందని తెలిపారు. దర్యాప్తు సంస్థలు త్వరలోనే నిందితులను పట్టుకుంటాయనే ఆశాభావం వ్యక్తంచేశారు. చోరీ అంశాన్ని దర్యాప్తు అధికారులు సాధారణ విషయంగా కాకుండా, అసాధారణ అంశంగా పరిగణించాలని హోసబలె నొక్కిచెప్పారు. కేసును సత్వ రం ఛేదించి భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని నిలబెట్టాలని కోరారు.

ఆర్థిక నిర్వ హణ పద్ధతులు, లోపాలు లేని పారదర్శకమైన విధానాల ద్వారా ట్రస్ట్ తిరిగి ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ఆలయ పరిసరాల్లో పవిత్రమైన, ఆధ్యాత్మికమైన వాతా వరణాన్ని నిరంతరం కొనసాగించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం దర్యాప్తు వేగం గా జరుగుతున్నందున హిందూ సమాజమంతా సంయమనం పాటించాలని సూచించారు. హిందూ ధర్మాన్ని, భక్తుల నమ్మకాలను కించపరిచేందుకు కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు.

ఈ దురదష్టకర చోరీ ఘట నను అడ్డం పెట్టుకుని సమాజంలో విభేదాలు సృష్టించాలనుకుంటున్నాయని దుయ్యబట్టారు. భక్తులంతా ఐక్యంగా ఉండి ఆ శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విజ్ఞప్తి మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘సిట్’ సిఫార్సుల ఆధారంగా చట్టపరమైన చర్యలు ప్రారంభం కావడం మంచి పరిణామమని హోసబలె తెలిపారు.

రీఆడిట్‌కు సిట్ సిద్ధం..

అయోధ్య రామ్‌మందిర విరాళాల చోరీ కేసు విషయంలో ‘సిట్’ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పరిధిలోని ఐదేళ్ల ఖాతాలను రీఆడిట్ చేసేందుకు సిద్ధమైంది. తన ప్రాథమిక దర్యాప్తులో భారీ అక్రమాలు గుర్తించిన నేపథ్యంలోనే రీఆడిట్ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగానే మళ్లీ మందిర పరిధిలోని నిర్మాణ వ్యయాలు, నగలు, బంగారం, వెండి వస్తువులతో సహా అన్ని ఆర్థిక లావాదేవీల రికార్డులను పరిశీలించనుంది.

మరోవైపు, విరాళాల లెక్కింపు పనిలో పాల్గొన్న ప్రధాన నిందితుడు అవినాష్ శుక్లాను అయోధ్య పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో శుక్లా నివాసం నుంచి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకుంది.

అలాగే, ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా, ఆలయ వ్యవహారాల్లో కీలకం వ్యవహరించిన గోపాల్ రావ్‌ను దర్యాప్తు బందం ఇప్పటికే ప్రశ్నించింది. చంపత్‌రాయ్, అనిల్ మిశ్రా తమ పదవులకు ఇటీవల రాజీనామాలు ప్రకటించగా.. ఈనెల 6న జరిగే సమావేశంలో వాటిపై ట్రస్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.