4 July, 2026 | 2:37 AM

పూటకో మాట మార్చం

04-07-2026 01:41 AM
  1. బీఆర్‌ఎస్ అప్పుల లెక్కలపై మాటకు కట్టుబడి ఉన్నా
  2. అసెంబ్లీలో ఆధారాలతో సహా నిరూపించా 
  3. ఆర్బీఐ లెక్కలను కూడా మీకు పంపుతున్నా
  4. ఇకనైనా దుష్ప్రచారం  మానుకోండి
  5. మంత్రి జూపల్లికి మాజీ మంత్రి హరీష్‌రావు బహిరంగ లేఖ

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, అవి కేవలం దుష్ప్రచారం మాత్రమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మంత్రి జూపల్లి కృష్ణారావుకు లేఖ రాశారు. వీడియోలు, ఇతర ఆధారాలను కూడా మంత్రికి వాట్సప్ ద్వారా పంపించారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్నవి, గ్యారెంటీ ఇచ్చి చెల్లించే రుణాలు కలిపి రూ.4.17 లక్షల కోట్లని అసెంబ్లీలో తెలిపానని, నేను చెప్పిన ఆ లెక్కలకు కట్టుబడి ఉంటానని, ఎక్కడైనా చర్చకు సిద్ధమని అసెంబ్లీలోనే స్పష్టంగా ప్రకటించానని గుర్తు చేశారు. తాజాగా మీరు రాసిన లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 2023 నుంచి జూన్ 2026 వరకు చేసిన అప్పులు రూ.1,77,058 కోట్లు అని పేర్కొన్నారని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లెక్కల ప్రకారం జూన్ 30, 2026 నాటికి రూ.1,86,067 కోట్లు అని స్పష్టం చేశారు.

అలాగే మీ ప్రభుత్వం చేసిన ఎఫ్‌ఆర్‌బీఎం, అన్ని రకాల అప్పులు కలిపి రూ.3,47,294 కోట్లు అని 2026 మార్చి 18న అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించారని పేర్కొన్నారు. మీలాగా మాట మార్చడం లేదు, పూటకో తీరుగా అంకెలు మార్చి చెప్పడం లేదని, మేము చెప్పిన లెక్కలకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. నేటికీ మా లెక్కల ప్రకారం సుమారు రూ.4.5 లక్షల కోట్ల అప్పు వివిధ మార్గాల ద్వారా మీ ప్రభుత్వం తీసుకున్న విషయం బహిరంగ రహస్యమే అని స్పష్టం చేశారు.

‘జూపల్లి గారూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో నేను అసెంబ్లీలో చేసిన ప్రసంగం వీడియో, మీ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన వీడియో, అలాగే మీ అప్పులకు సంబంధించిన ఆర్బీఐ అధికారిక లెక్కలను మీ వాట్సాప్‌కు పంపిస్తున్నాను’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. వాటిని ఒకసారి పరిశీలించి, వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతున్నా.. ఇకనైనా అప్పుల విషయంలో తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.