ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్ సర్కార్
- రాజ్యాంగాన్ని కాంగ్రెస్ గౌరవించడం లేదు
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలన.. కేవలం మాటల పాలనే.. సాగిస్తున్నాడు
- కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని చెప్పడం లేదు
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
నల్లగొండ, జూలై 3 (విజయక్రాంతి): ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందని, రాజ్యాంగాన్ని కాంగ్రెస్ గౌరవించడం లేదని ఆరోపించారు. సీఎం రేవంత్ కేవలం మాటల పాలన మాత్రమే సాగిస్తున్నాడని విమర్శించారు. కేంద్ర సహకారం తీసుకుని కూడా సీఎం చెప్పడం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగంపై గౌరవం లేదని పైగా బీజేపీపైనే విమర్శలు చేస్తున్నారన్నారు.
రాజ్యాంగాన్ని గౌరవించేది బీజేపీ మాత్రమే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీకి నేటికీ పశ్చాత్తాపం లేదని, క్షమాపణ చెప్పలేదని చెప్పారు. గురుకులాల పేరుతో రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నా యని, నేటికీ సొంత భవనాలు లేవని, కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయ్యాని ఆరోపించారు. గురుకులాల్లో వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయిందని, విద్యార్థులకు రూ.12 వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బాకీ ఉందన్నారు.
కేంద్రం సహకారంతోనే రాష్ట్రంలో జాతీయ రహదారులు, అమృత్ పథకం కింద పట్టణాలకు తాగునీటి వసతికి నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. కేంద్రం సహకారం తీసుకొని కూడా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం లేదన్నారు. నల్లగొండ జిల్లా అభివృద్ధిపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని నల్లగొండలో తాగునిటీ కోసం కేంద్రం రూ.83 కోట్లు ఇస్తే సీఎం శంకుస్థాపన చేశారని, మొన్నటి సభలో ఈ విషయం రేవంత్‌రెడ్డి చెప్పలేదన్నారు.
జిల్లాలో నిర్మించిన జాతీయ రహదారులు, ఎఫ్‌సీఐ గోదాములు, కనిపించడం లేదా అని ప్రశ్నించారు. శుక్రవారం నల్లగొండలో బీజేపీ నాయకుడు చింత సాంబమూర్తి రాసిన ‘ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట యోధుల’ పుస్తకం ఆవిష్కరణలో ఆయన మాట్లాడారు. ఎమర్జెన్సీ కాలంలో జిల్లాలో అనేకమంది జైలుకు వెళ్లారని, అనేక పోరాటాలు చేశారని, అవమానపడ్డా రని, వేధింపులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
వీ బీ జీ రాం జీ (వికసిత్ భారత్ ఫర్ రోజ్‌గార్ అజీవిక మిషన్ గ్రామీణ్) రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం అభినందనీయమని, కానీ మళ్లీ కోర్టుకు వెళ్దామనడం అంటే.. ఈ పథకాన్ని అమలు చేసేందుకు వారికి ఇష్టం లేనట్టుగా కనిపిస్తోందన్నారు. ఈ పథకం ద్వారా పేదల ఆర్థిక జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, మాధగోని శ్రీనివాస్‌గౌడ్, వీరెల్లి చంద్రశేఖర్, రవికుమార్‌గౌడ్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ ఒక్కటే
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల అవినీతిని, పాలనా వైఫల్యాలను ఎండగడుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు హెచ్చరించారు. ఈ రెండు పార్టీలు కెమెరాల ముందు పోట్లాడుకున్నట్లు నటించి, తెరవెనుక కాపాడుకుంటున్నాయని విమర్శించారు. ఆయా పార్టీల తీరు బిగ్‌బాస్ రియాల్టీ షోను తలపిస్తుందన్నారు. గురుకుల టెండర్లు, అవినీతి, పాలనా వైఫల్యా లతో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టిన ఈ రెండు పార్టీల బండారాన్ని ఆధారాలతో సహా బయటపెడుతామని పేర్కొన్నారు.
వాస్తవాలు, గణాంకాలను ప్రజల ముందు ఉంచడమే కాకుండా తెంలగాణ అభివృద్ధికి కేంద్రం అందించిన సహకారాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో వివిధ అభివృద్ధి పథకాల కింద రూ.13లక్షల కోట్లకు పైగా కేటాయించిందన్నారు. అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావడమే మార్గమని ఉద్ఘాటించారు. ఆ రెండు పార్టీల ‘డబుల్ ఎలిమినేషన్’(రాజకీయంగా అంతం) తథ్యమని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల తీరును విమర్శిస్తూ శుక్రవారం ఎక్స్ వేదికగా రాంచందర్‌రావు ట్వీట్ చేశారు.






