4 July, 2026 | 2:19 AM

కౌలు రైతు కన్నీరు

04-07-2026 01:17 AM

అసలే సాగు ఖర్చుల భారం.. మరోవైపు ఎల్ నినో పెనుభూతం

  1. కలవరపెడుతున్న వర్షాకాల పంటల సీజన్ 
  2. వ్యవసాయం చేయకపోవడమే మేలనుకుంటున్న కౌలు రైతులు 

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): తెలంగాణ వ్యవసాయ రంగంలో కీలక భూమిక పోషిస్తున్న కౌలు రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఎల్ నినో పరిస్థితుల కారణంగా చాలా మంది రైతులు వ్యవసాయానికి దూరంగా ఉం డాలని భావిస్తున్న తరుణంలో.. ఇప్పుడు కౌలు రైతుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా మారింది. రాష్ట్రంలో దాదాపు 72 లక్షల మందికి పైగా రైతులు ఉండగా, కౌలు రైతులు 22 లక్షలకు పైనే వరకు ఉంటారని ప్రభుత్వ వర్గాల అంచనా.

ఈ ఏడాది వర్షాలు తక్కువగా పడుతాయని, వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా పంటల మార్పిడి చేయాలని ప్రభుత్వం రైతులకు సూచిస్తున్నది. మరోవైపు సాగు ఖర్చుల భారం ప్రతిఏటా పెరుగుతున్నది. ఇక కౌలు రైతులు భూ యజమానికి కౌలు చెల్లించడంతోపాటు సాగు ఖర్చులను అదనంగా భరించాల్సి వస్తున్నది. అంటే భూ యజమానికి ఒక సాగు ఖర్చు ఉంటే.. కౌలు రైతుకు అదనంగా కౌలు భారం భరించాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో భూ యజమానికి చెల్లించే కౌలు రేటు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధానం అమలవుతోంది. ఆయా ప్రాంతాల పరిస్థితులను బట్టి కౌలు రేటు అమలవుతోంది. ఎకరా కు సుమారు రూ. 10 వేల నుంచి రూ. 15 వేలవరకు కౌలు రేట్లు అమలవుతున్నాయి. యూరియా కొనుగోలు నుంచి ఉత్పత్తి చేసిన పంటలను అమ్ముకునే వరకు కౌలు రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వాలు కూడా తమను పట్టించుకోవడంలేదని కౌలు రైతులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కౌలు రైతులు వ్యవసాయం చేయ డానికి ఆసక్తి చూపడం లేదు. కౌలుకు తీసుకుని.. సాగుచేసి అప్పుల పాలు కావ డం కంటే, ఏదో ఒక పని చేసుకుని బతకడం మేలనే అభిప్రాయానికి వస్తున్నారు. 

కౌలు రైతులు ఆరుగాలం శ్రమించి చమటోడ్చి పంటలు పండించినా కష్టం అంతా కౌలు కింద పట్టాదారులకే చెల్లించాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, తెగుళ్లు వచ్చి పంటలు దెబ్బతిన్నా పట్టాదారులకు కౌలు చెల్లించాల్సిందే. రాష్ట్రం లోని కొన్ని జిల్లాల్లో ముందుగానే కౌలు సొమ్ము చెల్లించిన వారికే పట్టాదారులు భూములను కౌలుకు ఇస్తున్నారు.

విత్తనాలు, ఎరువుల ధరలతోపాటు ట్రాక్టర్లతో దున్నడం, హార్వెస్టర్ కిరాయిలు, కలుపుతీత, వరినాట్లు వేసేందుకు కూలీ ధరలు పెరగడంతో పెట్టుబడులు మరింత అధికమయ్యాయి. పంట నష్టపోతే ప్రభుత్వం ఇచ్చే పరిహారం పట్టాదారులకే ఇస్తారు. బ్యాంకులో పంట రుణాలు, ఇతరత్రా సబ్సిడీ పథకాలు వారికే వర్తింపజేస్తున్నారు. దీంతో కౌలు రైతులకు చెమట చుక్కలు తప్ప ఏమీ మిగలడం లేదు. అప్పులపాలై పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

భరోసా ఇవ్వని సర్కార్.. 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా కౌలు రైతులకు భరోసా లేకుండాపోయింది. ఎన్నికల ముందు కౌలు రైతులకిచ్చిన హామీల ఊసే ఎత్తడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కౌలు రైతులకు సైతం రైతు భరోసా పథకాన్ని వర్తింపజేసి ఎకరానికి 7,500 చొప్పున ఏడాదికి రూ. 15 వేలు అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్  ప్రభుత్వం  ప్రతి ఏటా ఎకరాకు రూ. 12 వేల చొప్పున రాష్ట్రంలోని 72 లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమచేస్తోంది.

అయితే కౌలురైతులకు రైతు భరోసా ఇవ్వకుండా  పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని కౌలు రైతుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా రైతులకు మాత్రమే రైతుబంధు ద్వారా ఎకరానికి రూ. 5 వేల చొప్పున ఏడాదికి రూ. 10 వేలు ఇచ్చింది. కౌలు రైతులను విస్మరించడంతో పాటు కూలీలకు సైతం ఎలాంటి సాయాన్ని అందజేయలేదు. దీంతో కౌలు రైతులు, రైతు కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా కౌలు రైతులకు భరోసా కల్పించినప్పటికీ, ఇప్పటివరకు సాయాన్ని అందించే విషయమై పట్టించుకోకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ  సీజన్‌కు సంబంధించిన నిధులను రైతుల ఖాతాల్లో ప్రతిరోజు జమచేస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు తమకు కూడా ఇదే సీజన్‌లో రైతు భరోసా అందజేయాలని కౌలు రైతులు ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.

అడ్డగోలుగా పెరిగిన కౌలు ధరలు.. 

కౌలు రైతులకు ప్రభుత్వం రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పడంతో పాటు సన్న రకాలకు బోనస్ ఇస్తుండడంతో   పట్టాదారులు కౌలు ధరలను పెంచారు. ఇప్పటివరకు అన్నిరకాల నీటి వసతి ఉండి వరి సాగయ్యే భూములకు ఎకరానికి ఒక పంటకు 10 నుంచి 15 వేల రూపాయల కౌలు చెల్లించారు.

ప్రస్తుతం ఆ ధరలను 16 నుంచి 18 వేల రూపాయల వరకు పెంచినట్లుగా కౌలు రైతులు చెబుతున్నారు. మరికొందరు పట్టాదారులు సన్న వరి పండిస్తే దానికింద వచ్చే బోనస్‌లో సగం ఇస్తేనే కౌలు కొనసాగిస్తానని, లేదంటే కౌలు రద్దు చేస్తానని హెచ్చరించడంతో చేసేదేమీలేక కొంతమంది కౌలు రైతులు కౌలు ధరలను పెంచినట్లుగా చెబుతున్నారు. 

భూ అదీకృత సాగుదారు చట్టం అమలుచేయాలి 

ప్రభుత్వాలు ఏవైనా కౌలు రైతులంటే పట్టింపే లేకుండా పోయింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాకా కౌలు రైతులను చిన్నచూపు చూస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘భూ అధీకృత సాగుదారు చట్టం’ అమలు చేస్తామని 2023 ఎన్నికల ముందు ఇచ్చిన హామీని పూర్తిగా విస్మరించింది.

అంతేకాకుండా రైతులకు వ్యవసాయ సాగు ఖర్చులకుగాను ప్రతిఏటా ఎకరాకు రూ. 12 వేల చొప్పున ఇస్తున్న ‘రైతు భరోసా’ హామీని అమలు చేయడం లేదు. కౌలు రైతులు ఎరువులు కొనుగోలు నుంచి ప్రకృతి వైపరీత్యాల పరిహారం, పంటలను అమ్ముకునే వరకు భూ యజమాని మీదనే ఆధారపడాల్సి వస్తుంది.

యాప్‌ద్వారా ఎరువుల కొనుగోలు నిబంధనలతో  పట్టాదారు సెల్ ఫోన్‌కే ఓటీపీ వెళుతోంది. సరైన సమయంలో పట్టాదారు ఓటీపీ చెప్పకపోతే.. ఎరువులు కొనుగోలు విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి మారాలంటే కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించి.. కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. 

కన్నెగంటి రవి, రైతు స్వరాజ్యం వేదిక అధ్యక్షులు