4 July, 2026 | 2:11 AM

బీఆర్‌ఎస్ సర్కారు అప్పులు 8లక్షల కోట్ల పైమాటే.. వాస్తవం కాదా?

04-07-2026 01:11 AM

బస్తీమే సవాల్

  1. బీఆర్‌ఎస్ హయాం రుణాల చిట్టా మా వద్ద ఉంది..
  2. మా ప్రభుత్వం వచ్చాక అసలు, వడ్డీతో కలిపి 2,08,681 కోట్లు చెల్లించాం..
  3. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరుతో ఇప్పుడు మాపై నిందలెందుకు?
  4. కేటీఆర్, హరీశ్‌రావు అబద్ధాలను ప్రచారం చేస్తున్నరు: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): ‘ఎఫ్‌ఆర్బీఎం పరిమితికి లోబడి కొన్ని రుణాలు, కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న ప్రభుత్వ గ్యారంటీ రుణాలు ఇంకొన్ని.. వాటితోపాటు ఉద్యోగుల పెం డింగ్ బిల్లులు, డిస్కంల బాకీలన్నీ కలిపి పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అయిన అప్పులు రూ.8,21,651 కోట్లు. ఆ అప్పులు వాస్త వం కాదా?’ అని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రశ్నించారు.

మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి శుక్రవారం హైదరాబాద్ సచివాలయంలో నిర్వహించిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ అప్పుల జాబితా అంతా తమ వద్ద ఉందని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరుతో ఇప్పుడు తమపై బురద చల్లాలని చూస్తున్నారని మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. స్థాయి అనేది పుట్టుకను బట్టి రాదని, ప్రజాజీవితంలో పోషించేపాత్రను బట్టి వస్తుందని దుయ్యబట్టారు.

చేసేదంతా చేసి ఇప్పుడు తమ ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలను అస్త్రాలుగా మార్చుకుని, గోబెల్స్ ప్రచా రానికి పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు. ఇప్పటివరకు తాము సంయమనం పాటించామని, ఇకపై ఉపేక్షించబోమని హెచ్చరించారు. హరీశ్‌రావు, కేటీఆర్ అబద్ధాలను పోగేసి ప్రచారం చేయ డమే తప్ప, ప్రజలకు తమ పాలనలో చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.

అబద్ధాల పునాదులపై ఏ ఆర్థిక వ్యవస్థను నిర్మించలేమని, వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా అప్పులపై శ్వేతపత్రం విడుదల చేశామని గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో అప్పులకు సంబంధించి కేవలం రెండున్నరేళ్లలోనే ప్రజాప్రభుత్వం రూ.2,08,681 కోట్లను అసలు, వడ్డీల రూపంలో బ్యాంకులకు చెల్లించిందని స్పష్టం చేశారు.

తమ పాలనలో కేవలం రూ.3 లక్షల కోట్లే అప్పు చేశామని హరీశ్‌రావు అబద్ధాలు చెబితే, మరి రిజర్వ్ బ్యాంక్ ద్వారా ప్రభుత్వ ఖాతాల నుంచి చెల్లించిన ఆ భారీ మొత్తం దేనికో వారే సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా చేసిన అప్పులను సమర్థంగా నిర్వహించి, రాష్ట్ర ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదన్నారు.

ఒకవైపు నెలనెలా ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తూనే రైతు భరోసాతో పాటు ఇతర సంక్షేమ పథకాలను అమలు చేస్తూన్నామని వెల్లడించారు. ప్రజాప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్లే.. ఇదంతా సాధ్యమవుతున్నదని వివరించారు. తమ ప్రభుత్వం వచ్చాక, కొత్తగా రూ.1.77 లక్షల కోట్ల అప్పులు మాత్రమే తీసుకొచ్చామని వివరించారు. 

రూ.22 వేల కోట్లు ఆదా చేశాం..

బీఆర్‌ఎస్ ప్రభుత్వం కార్పొరేట్ బ్యాంకుల వద్ద 10 నుంచి 10.5 శాతం వరకు భారీ వడ్డీ రేట్లతో అప్పులు తెచ్చి రాష్ట్రంపై పెనుభారం వేసిందని డిప్యూటీ సీఎం ఆరోపించారు. తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ఆ అప్పులను డెబిట్ రీస్ట్రక్చరింగ్ ప్రక్రియలోకి తీసుకువచ్చిందని వ్యాఖ్యానించారు. తమ చొరవతో 2025--26 నుంచి 2031-32 మధ్య కాలంలో చెల్లించాల్సిన రూ.34,058 కోట్ల రుణ భారాన్ని, రూ. 11,915 కోట్లకు తగ్గించామని వివరించారు.

దీని ద్వారా రాష్ట్రానికి రూ.22,142 కోట్లు ఆదా జరిగిందని వివరించారు. అడ్డగోలుగా అప్పులు తెచ్చిన వారు, ఇలాంటి ఆర్థిక నిర్వహణపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల, మిషన్ భగీరథ ప్రాజెక్టుల కోసం కార్పొరేషన్ల పేరుతో భారీగా అప్పులు తీసుకుందని, అప్పట్లో ఆ అప్పులను రైతులే కడతారని, పన్నుల ద్వారా వసూలు చేస్తామని చెప్పారని వెల్లడించారు.

సింగరేణి సంస్థపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి ఆస్తులు, వనరులు రాష్ట్రానివేనని, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సింగరేణికి కొత్తగా ఒక్క కోల్ బ్లాక్‌నైనా తీసుకువచ్చారా? అని నిలదీశారు. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులను భారీగా విస్తరించిన కేసీఆర్ ప్రభుత్వం, వాటికి అవసరమైన బొగ్గు గనులను మాత్రం ఎందుకు సమకూర్చలేదని నిలదీశారు.

కేంద్రం వేలం వేసిన కోల్ బ్లాకుల్లో పాల్గొని సింగరేణికి ఆ గనులను ఎందుకు దక్కించుకోలేదని ప్రశ్నించారు. సింగరేణి పరిధిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందంటూ బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపడేశారు. సింగరేణి అస్తిత్వం, కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకే వారు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి సంస్థలో ఎలాంటి అక్రమాలకు తావులేదని, సంస్థ భద్రత కోసం అత్యున్నత స్థాయి జియో-ఫెన్సింగ్ వ్యవస్థ ఉందని స్పష్టం చేశారు.

కోయగూడెం, సత్తుపల్లి- వంటి బొగ్గు బ్లాకులను సింగరేణికి దక్కకుండా చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. సంస్థ పరిధి నుంచి ఒక్క కిలో బొగ్గునా అక్రమంగా బయటకు వెళ్లే అవకాశం లేదని, తెలంగాణ ప్రజల ఆస్తిని, 40 వేల మంది కార్మికుల జీవితాలను దెబ్బతీసేలా ప్రతిపక్షాలు వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. సంస్థ సొంత బిడ్డ వంటిదని, ఆ సంస్థపై 40 వేల మంది కార్మికుల జీవితాలు ఆధారపడి ఉన్నాయని, సంస్థపై అనవసరంగా అభాండాలు వేయడం తెలంగాణకే నష్టమని అభిప్రాయపడ్డారు.

అడ్డగోలు విమర్శలు సరికాదు.. 

సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల సౌకర్యాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని ప్రతిపక్ష నేతలు హరీష్‌రావు, కేటీఆర్ రాజకీయ లబ్ధి కోసం దిగజారి మాట్లాడుతున్నారని డిప్యూటీసీఎం మండిపడ్డారు. గత పదేళ్లలో ఇరిగేషన్, రోడ్ల నిర్మాణాల పేరుతో ఎస్‌ఎస్‌ఆర్ రేట్లు పెంచిన మీరు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పిల్లలు తినే ఆహారానికి గానీ, వారి కాస్మెటిక్ ఛార్జీలకు గానీ రేట్లు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. 

పిల్లల కాస్మొటిక్ ఛార్జీలను 200 శాతం పెంచామని, డైట్ ఛార్జీలను ప్రతి నెలా మొదటి వారంలోనే అందేలా స్ట్రీమ్ లైన్ చేశామని, నాణ్యతతో కూడిన దుస్తులు, షూస్, పుస్తకాలను ఓపెన్ టెండర్ల ద్వారా పారదర్శకంగా అందిస్తున్నామని వెల్లడించారు. ప్రతిపక్ష నాయకులుగా కనీస నిబద్ధత, బాధ్యత లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రతి పనిని పారదర్శకంగా నిర్వహిస్తోందని, నిరాధారమైన ఆరోపణలతో రాష్ట్రాన్ని, సమాజాన్ని ఇబ్బందులకు గురిచేసే కార్యక్రమాలు ఆపాలని సూచించారు.

తెలంగాణ ప్రజల ఆస్తిని, కార్మికుల చెమటను కాపాడే బాధ్యత మాది అని, అబద్ధాల పునాదులపై రాజకీయాలు చేయడం మానుకోవాలని ప్రతిపక్షాలకు స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతగా నా అటెండెన్స్ రికార్డులను ఎవరైనా చూసుకోవచ్చు.. నేను ఒక్క రోజు కూడా అసెంబ్లీని మిస్ కాలేదన్నారు. కానీ, ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ సభకు రాకుండా, బాధ్యత లేకుండా విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమనిని ప్రశ్నించారు. 

అరెస్ట్ చేయించేంత పిరికివాళ్లం కాదు: మంత్రి పొన్నం ప్రభాకర్

చర్చకు సై అని.. పోలీసులతో అరెస్ట్ చేయించేంత పిరికివాళ్లం తాము కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ నొక్కిచెప్పారు. గన్‌పార్క్ వద్దకు రమ్మని, ఆ తర్వాత ఫోన్‌లిఫ్ట్ చేయలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపిస్తున్నారన్నారు. గన్‌పార్క్ వద్దనున్న గోషా మహల్, మలక్ పేటలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉంటే, అక్కడికి వెళ్లామని వెల్లడించారు.

పదే పదే తాము ఫోన్ లిఫ్ట్ చేయలేదంటున్న హరీశ్‌రావు, తాము బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదని గుర్తుచేశారు.ఒక పొన్నం ప్రభాకర్, ఒకఅడ్లూరి లక్ష్మణ్ కిందిస్థాయి నుంచి వచ్చిన వ్యక్తులని తెలియదా అంటూ బీఆర్‌ఎస్ నేతలను నిలదీశారు. పదేళ్లుగా బీఆర్‌ఎస్‌తో కుమ్మక్కై లాభపడిన చెంచాగాళ్లు వచ్చి, ఏది చెప్తే అది నమ్మి ఇష్టానుసారం మాట్లాడితే చెల్లదని హెచ్చరించారు. గురుకులాల్లో మొత్తం టెండర్లు రూ.1142 కోట్లయితే, రూ.2 వేల కోట్ల స్కామ్ ఎలా జరుగుతుందని నిలదీశారు.