దేశానికి ఆర్థిక తుపాను ముప్పు
- ఇంతకు ముందెన్నడూ చూడని సంక్షోభాన్ని చూస్తాం
- సంక్షోభం గురించే తెలిసే ప్రధాని మోదీ పొదుపు మంత్రం
- ఉద్యోగులు, చిరువ్యాపారులు, రైతులు కుదుపులకు సిద్ధంగా ఉండాలి
- దేశ పౌరులకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ హెచ్చరికలు
న్యూఢిల్లీ, మే ౧౯: భారత్ వైపు ఒక పెద్ద ఆర్థిక తుపాను దూసుకువస్తున్నదని, జీవితంలో ఇంతకముందున్నెడూ చూడని ఆర్థిక సంక్షోభం చూడబోతున్నామని ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ జోస్యం చెప్పారు. ఆర్థిక సంక్షోభం గురించి తెలిసే ఇటీవల ప్రధాని మోదీ దేశప్రజలకు పొదుపు మంత్రం వల్లెవేశారని అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లా బచ్‌రావన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ద్రవ్యోల్బణం ముందెన్నడూ నమోదు కానంత నమోదవుతుందని అంచనా వేశారు.
రానున్న ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు యువత, రైతులు, చిరువ్యాపారులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. భారతీయులు విదేశీ ప్రయాణాలు చేయవద్దని హితబోధ చేసిన ప్రధాని మోదీనే, ఇప్పుడు విదేశీ పర్యటనలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎవరూ బంగారం కొనవద్దని, ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలని చెబుతూ ప్రధాని మాత్రం విలాసవంతమైన ఫ్లుట్లైలో విదేశాలకు ఎగిరిపోతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పక్కా ప్రణాళికలు ఇంధన ధరలు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.
ఇలాంటి సంక్షోభ సమయాల్లో కేంద్రం ప్రజల వైపు నిలబడదని, వారి అండదండలు ఖచ్చితంగా కార్పొరేట్ శక్తులైన అంబానీ, అదానీలకే ఉంటాయని దు య్యబట్టారు. ఉద్యోగులు, చిరువ్యాపారులు, రైతుల్ని కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, కాంగ్రెస్ ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉందని, కానీ.. కేంద్రం మాత్రం ఉదాసీనతే ప్రదర్శిస్తూ వస్తున్నదని విమర్శించారు.






