ఇంధన ధరలు 90 పైసలు పెంపు
- రెండోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- పెరిగిన ధరలు తక్షణం అమలులోకి
- నాలుగు రోజుల వ్యవధిలో రూ.౩.౯౦ వడ్డన
- దేశావ్యాప్తంగా వాహనదారుల గగ్గోలు
- హైదరాబాద్‌లో ఈ నెల ౧౪న లీటర్ పెట్రోల్ ధర రూ.107.45
- ప్రస్తుత ధర రూ.111.88
న్యూఢిల్లీ, మే ౧౯: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఈనెల ౧౫న లీటర్‌కు రూ.౩ చొప్పున పెంచుకునేందుకు ఆయిల్ కంపెనీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, మంగళవారం లీటర్‌కు మరో ౯౦ పైసలు పెంచుకునేందుకూ అనుమతించింది. పెరిగిన ధరలు తక్షణం అమలులోకి వచ్చాయి. తాజాగా ధరల పెంపు తర్వాత కూడా చమురు సంస్థలు రోజుకు రూ.750 కోట్ల మేర నష్టాన్ని చవిచూశాయి. కేంద్రం ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటికీ కంపెనీలకు నష్టాల నుంచి ఉపశమనం కలుగలేదు.
దీంతో కేంద్రం రెండోసారి కూడా ధరల పెంపునకు అవకాశం ఇచ్చింది. నాలుగు రోజుల వ్యవధిలో రెండుసార్లు ఇంధన ధరలు పెరగడంతో దేశవ్యాప్తంగా వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఒక బ్యారెల్ ముడి చమురు ధర ౧౧౦ డాలర్లకు పైగా పలుకుతున్నది. హోర్ముజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడం ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపించింది.
ఈ సంక్షోభం కారణంగా దేశీయంగా దిగుమతి ఖర్చులు బాగా పెరిగాయి. దీంతో వాహనదారులపై భారం పడకుండా ఆయిల్ కంపెనీలే కొద్దిరోజులు నష్టాలను భరిస్తూ వచ్చాయి. కంపెనీలు ఒత్తిడి తీసుకువచ్చినప్పటికీ, ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చింది. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో కేంద్రం ధరల పెంపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దేశ పౌరులంతా పొదుపు మంత్రం పాటించాలని, దీనిలో భాగంగానే ఇంధనాన్ని పొదుపు వాడుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన కొద్దిరోజులకే ఇంధన ధరలు పెరగడం గమనార్హం.
తెలంగాణపై ప్రభావం
పెరిగిన ఇంధన ధరల ప్రభావం తెలంగాణపైనా పడుతున్నది. ఈనెల 1౪ వరకు హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 107.45, లీటర్ డీజిల్ ధర రూ.95.70గా నమోదైంది. మరుసటి రోజు రూ.౩ చొప్పున ఇంధన ధరలు పెరిగాక లీటర్ పెట్రోల్ ధర రూ.110.89, లీటర్ డీజిల్ ధర రూ.98.90కు చేరుకుంది. మంగళవారం ౯౦ పైసల మేర ఇంధన ధరలు పెరిగాక లీటర్ పెట్రోల్ ధర రూ.111.88 ఎగబాకింది. లీటర్ డీజిల్ ధర రూ.99.95 మార్కుకు చేరుకుంది.
అలాగే, ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.98.64, డీజిల్ ధర రూ.91.58కు చేరకున్నది. కేంద్రం విధించే విలువ ఆధారిత పన్ను (వ్యాట్) వ్యత్యాసాల వల్ల రాష్ట్రాల మధ్య ధరల వ్యత్యాసాలు ఉంటాయి. ఈ కారణంగానే దేశంలో ఏ రెండు రాష్ట్రాల్లోనూ ఒకే రకమైన ఇంధన ధరలు అమలు కావు.






