31 August, 2026 | 5:57 PM

Breaking News

20 జిల్లాల్లో 46 డిగ్రీలు

22-05-2026 12:50 AM

రాష్ట్రంలో భానుడి భగభగలు

అత్యధికంగా పెద్దపల్లి, సూర్యాపేట, కొత్తగూడె జిల్లాల్లో 46.5 డిగ్రీలు

అత్యల్పంగా నారాయణపేటలో 42.4 డిగ్రీలు

ఎండకు జంకుతున్న ప్రజలు

హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డస్థాయిలో నమోదవుతున్నాయి. గురువారం ఏకంగా 20 జిల్లాల్లో ఉష్ణోగ్ర తలు 46 డిగ్రీలు దాటాయి. అత్యధికంగా పెద్దపల్లి, సూర్యాపేట, కొత్తగూడెం జిల్లాల్లో 46.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో 42.4 డిగ్రీలుగా నమోదైంది.

హనుమకొండ, నల్లగొండ, కరీంనగర్, జగిత్యాల, భూపాలపల్లి, ఖమ్మం, మంచిర్యాల, ములుగు, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో 46.4 చొప్పున, మహబూబాబాద్, భువనగిరి, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 46.3 చొప్పున, ఆదిలాబాద్, వరం గల్ జిల్లాల్లో 46.2, సిద్దిపేట జిల్లాలో 46.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకుపైనే నమో దయ్యాయి. కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలకు హాజరయ్యే భక్తులకు ఎండ వేడి తాకకుండా స్ప్లింకర్లతో నీళ్లు చల్లే విధంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. రోడ్ల వెంట ప్రత్యేకంగా ట్యాంకర్లతో నీళ్లు చల్లారు.

అల్లాడుతున్న ప్రజలు

రాష్ట్రంలో గరిష్ఠస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే మాడుపగులుతుండటంతో జనం ఇండ్లనుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. వృద్ధులు, చిన్నారులు ఇండ్లకే పరిమితమవుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయట కు రావడంలేదు. మధ్యాహ్నం సమయంలో జనసంచారం లేక రహదారులు కర్యూను తలపిస్తు న్నాయి. ఎండల తీవ్రత తగ్గేవరకు వృద్ధులు, చిన్నారులు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటలవరకు బయటకు రావద్దని, ఎండవేడి నుంచి తగిన జాగ్రతలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లినవారు ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు.

మూడు రోజులు వడగాలులు

రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని చాలాచోట్ల వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఎక్కువగా వడగాలులు వీస్తాయని పేర్కొన్నది. శని, ఆదివారాల్లో పెద్దపల్లి, భూపాలపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ హనుమకొండ జిల్లాల్లో, ఆదివారం ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.