22 May, 2026 | 3:25 AM

రైతును మోసం చేస్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే..

22-05-2026 02:09 AM

ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి

జడ్చర్ల, మే 21: రైతును మోసం చేస్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గంగాపూర్ గ్రామ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పిఏసీఎస్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ  వర్ధంతి సందర్భంగా గంగాపూర్ మార్కెట్ యార్డులో ఆయన చిత్రపటానికి  పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.  రైతుల వద్ద పచ్చి మొక్కజొన్నను తక్కువ ధరకు కొనుగోలు చేసి, మార్కెట్ షెడ్లలో నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నారని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను తప్పుదోవ పట్టించి అన్యాయం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

గత రెండు రోజుల క్రితం రాత్రి మార్కెట్ యార్డును సందర్శించిన సమయంలో రైతులు తమ ధాన్యాన్ని బయట ఉంచుతున్నారని, ట్రేడర్ల ధాన్యాన్ని మాత్రం షెడ్లలో నిల్వ చేస్తున్నారని తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. వెంటనే డీఐజీ చౌహాన్ తో మాట్లాడి పూర్తి స్థాయిలో విచారణ జరిపి అక్రమంగా నిల్వ ఉంచిన ధాన్యాన్ని బయటకు తరలించవద్దని అధికారులకు ఆదే శించారు. రైతులను ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, జ్యోతి అల్వాల్ రెడ్డి, సుదర్శన్ గౌడ్, యా దయ్య,మీనాజ్, కోనేటి పుష్పలత, కాజా అలీముద్దీన్, బాద్మి ధ్రువ  తదితరులు పాల్గొన్నారు.