22 May, 2026 | 3:39 AM

ఉద్యోగులు సమయపాలన పాటించాలి

22-05-2026 12:50 AM

ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ 

భద్రాద్రికొత్తగూడెం, మే 21, (విజయక్రాంతి ): ఉద్యోగులు సమయపాలన పాటించాలని, సరైన కారణం లేక వీధులకు గైరహాజరవుతున్న, సకాలంలో హాజరు కాకుండా వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలోని వివిధ శాఖల కార్యాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన, క్రమశిక్షణ, ప్రజలకు అందించే సేవలపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ జిల్లా విద్యాశాఖ, ఎస్సీ సంక్షేమ శాఖ, పౌర సరఫరాల శాఖ, కార్మిక శాఖ, ఉపాధి కల్పన శాఖ, వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాలను పరిశీలించారు. 

ఈ సందర్భంగా కార్యాలయాల్లో సిబ్బంది హాజరు, విధుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. తనిఖీలో భాగంగా,కలెక్టర్ ప్రతి కార్యాలయంలోని సీట్ల వద్దకు వెళ్లి అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఖాళీగా ఉన్న సీట్లను పరిశీలించి సంబంధిత ఉద్యోగులు ఇప్పటివరకు ఎందుకు విధులకు హాజరుకాలేదని అధికారులను ప్రశ్నించారు. సరైన కారణాలు తెలియజేయకుండా ఆలస్యంగా వస్తున్న సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఇటువంటి వారిపై  చర్యలు తీసుకోవాలని గురువారం జీతంలో కోత విధించాలని  సంబంధిత అధికారులను ఆదేశించారు.

సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించిన కలెక్టర్, ప్రతి ఉద్యోగి ఉదయం 10:30 గంటలలోపు తప్పనిసరిగా కార్యాలయాలకు హాజరు కావాలని స్పష్టం చేశారు. విధులకు హాజరైన ప్రతి ఉద్యోగి హాజరు రిజిస్టర్లో తప్పనిసరిగా సంతకం చేయాలని సూచించారు. నిర్ణీత సమయానికి కార్యాలయాలకు రాకపోవడం లేదా హాజరు రిజిస్టర్లో సంతకం చేయని వారిని గైర్హాజరుగా నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వస్తారని, ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడకూడదన్నారు . ప్రతి శాఖలో అధికారులు, ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలని సూచించారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట కలెక్టరేట్ ఏవో అనంత రామకృష్ణ, సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.