22 May, 2026 | 4:00 AM

మాజీ సీఎం కేసీఆర్.. ఉద్యమకారుల ద్రోహి

22-05-2026 12:52 AM

ప్రతి ఉద్యమకారుని గుర్తించి న్యాయం చేసేందుకే కేకే కమిటీ

ముషీరాబాద్, మే 21 (విజయక్రాంతి): తెలంగాణ తొలి మలిదశ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం కీలక భూమిక పోషించిన తెలంగాణ ఉద్యమకారులకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని, ఉద్యమకారుల ద్రోహి బిఆర్‌ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అని పలువురు ఉద్యమకారులు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేకే కమిటీతో తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం ఉద్యమ నాయకుడు ప్రకాష్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా తొలి మలిదశ ఉద్యమకారుడు కాచం సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ ఉద్యమకారులకు కేసిఆర్ కొంత మేరకు న్యాయం చేసే దిశగా ప్రయత్నించారని అనడంతో ఒక్కసారిగా కెసిఆర్ హయంలోనే తెలంగాణ ఉద్యమకారులకు తీవ్రఅన్యాయం జరిగిందని పలువురు ఉద్యమకారులు అగ్రహావేశాలకు లోనయ్యారు, ఒక దశలో కుర్చీలు విసురుకునే స్థితికి వెళ్లారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అనంతరం కేకే కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ ఉద్యమకారులకు కేసీఆర్ చేసింది ద్రోహమేనని, ఉద్యమకారులు ఆవేశాలకు పోకుండా సంయమనం  పాటించాలన్నారు. కేకే కమిటీ మరో సభ్యుడు మోతే శోభన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఉద్యమకారుని గుర్తించి న్యాయం చేసేందుకే కే కే కమిటీని వేశారని అన్నారు. ఈ సమావేశంలో తొలి,  మలిదశ ఉద్యమకారులు పాల్గొన్నారు.