19 April, 2026 | 4:47 AM

చారిత్రక కట్టడాల సంరక్షణే ప్రభుత్వ లక్ష్యం

19-04-2026 01:27 AM

అడికిమెట్ మెట్లబావి’ని ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

సికింద్రాబాద్, ఏప్రిల్ 18(విజయక్రాంతి): ఒకప్పుడు చెత్తాచెదారంతో నిండి, తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలోని చారిత్రక ‘అడికిమెట్ మెట్లబావి’ నేడు అద్భుతమైన పబ్లిక్ స్పేస్‌గా రూపుదిద్దుకుంది. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా పునరుద్ధరించిన  ‘అడికిమెట్ మెట్లబావి’ని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు  శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. మెట్లబావులు కేవలం నీటి వనరులు మాత్రమే కాదని, అవి మన పూర్వీకుల అద్భుత శిల్పకళా నైపుణ్యానికి, నాటి జీవనశైలికి సజీవ సాక్ష్యాలని కొనియాడారు. ఇలాంటి వారసత్వ సంపదను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.ఈ చారిత్రక బావికి పూర్వ వైభవం తీసుకురావడంలో దొడ్ల డైరీ సంస్థ ప్రశంసనీయమైన పాత్ర పోషించిందని మంత్రి పేర్కొన్నారు.

తన కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఈ ప్రాజెక్టు కోసం రూ. 1 కోటి భారీ విరాళాన్ని అందజేయడం అభినందనీయమన్నారు. గత మూడేళ్లుగా ‘సాహె’ సంస్థ ప్రతినిధులు పట్టువదలని శ్రమతో సుమారు 3 వేల టన్నుల చెత్తను తొలగించి, ఈ బావికి పునర్జీవం పోశారని వివరించారు. ఈ కార్యక్రమంలో  ఎండీ అండ్ సీఈఓ సునీల్ రెడ్డి, సాహి ఫౌండేషన్  ఫౌండర్, ఆర్కిటెక్ట్ కల్పన రమేష్, అన్నపూర్ణ, ప్లీచ్  ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి పాల్గొన్నారు.