15 July, 2026 | 12:00 AM

ఒకే బస్సు.. రెండు రంగులు!

15-07-2026 12:00 AM
  1. ఆర్టీసీ ‘మేకప్’ మాయాజాలం!
  2. పాత ‘పల్లె వెలుగు’కు ‘మెట్రో ఎక్స్‌ప్రెస్’ రంగులు.. 
  3. జేబులు గుల్లవుతున్నాయని ప్రయాణికుల ఆగ్రహం!

ఇబ్రహీంపట్నం, జులై 14 (విజయక్రాంతి): నిన్నటివరకు పల్లెవెలుగుగా తిరిగిన బస్సే.. ఇవాళ రంగు మార్చుకుని ‘మెట్రో ఎక్స్ప్రెస్’గా ప్రత్యక్షమవుతోంది. ఊసరవెల్లి లా రంగులు మారుస్తున్న ఆర్టీసీ బస్సుల తీరుపై ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్ర యాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిపో పరిధిలో ఉన్న పాత ఆర్డినరీ బస్సులకు రంగులు మార్చి, వాటిని ఎక్స్ప్రెస్ బస్సులుగా చలామణి చేస్తూ ప్రయాణికుల నుంచి ముక్కుపిండి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఒకే బస్సుకు రెండు రంగులు వేసి తిప్పుతుండటంతో అసలు అది ఏ బస్సో అర్థం కాక ప్రయాణికులు జుట్టు పీక్కుంటున్నారు.

మహాలక్ష్మి పథకం సాకుతో పురుషులపై భారం?

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ‘మహాలక్ష్మి’ పథకం కింద ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే, దీనిని సాకుగా చూపిస్తూ పురుషులపై అదనపు భారం మోపుతున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కనుమరుగవుతున్న ఆర్డినరీ సర్వీసులు

 పాత బస్సులకు ఎక్స్ప్రెస్ పెయింటింగ్ వేస్తుండటంతో రూట్లలో ఆర్డినరీ బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. సాధారణ ఛార్జీలతో ప్రయాణించాల్సిన సామా న్యులు, తప్పనిసరి పరిస్థితుల్లో అదే పాత బస్సుల్లో ఎక్స్ప్రెస్ ధరలు చెల్లించి ప్రయాణించాల్సి వస్తోంది. సీట్లు అవే.. సౌకర్యాలు అవే.. కానీ రంగు మారిందని టికెట్ రేటు పెంచడంపై పురుష ప్రయాణికులు మండిపడుతున్నారు.

డ్యూయల్ కలర్ వింత.. ముక్కున వేలేసుకుంటున్న జనం

బాడీ పల్లె వెలుగు.. ఫేస్ మెట్రో ఎక్స్ప్రెస్

పల్లె వెలుగు (ఆర్డినరీ) బస్సుకు మెట్రో ఎక్స్ప్రెస్ కలర్ వేయడంతో అర్థంకాక ప్రజ లు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. బస్సుల రంగులు మార్చి అధిక డబ్బులు వసూలు చేస్తున్న తీరును చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రయాణికులను నిలువునా దోచుకునేందుకే ఈ ‘కలరిం గ్’ జిమ్మిక్కులు చేస్తున్నారని ఆరోపిస్తున్నా రు. సిటీ బస్సుల రంగులు మార్చి మోసం చేయడం ఆపాలి. మాయ మాటలు, రంగుల మార్పిడి పక్కన పెట్టి డిపోకు కొత్త బస్సులు కేటాయించాలి‘ అని ఇబ్రహీంపట్నం  ప్ర యాణికులు డిమాండ్ చేస్తున్నారు.

ఆకస్మిక సమ్మెల సెగ

ఇబ్రహీంపట్నం డిపో పరిధిలో రంగుల మార్పిడి సమస్యే కాకుండా, ప్రైవేట్ బస్సుల సమ్మె వల్ల ప్రయాణికులు మరిన్ని ఇబ్బందులుఎదుర్కొంటున్నారు. ఈ వివాదంపై ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ సుజాత స్పందించారు. భవిష్యత్తులో ఇలాంటి రంగుల గందరగోళం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం డిపో పరిధిలో ఉన్న ప్రైవేట్ (అద్దె )బస్సుల యజమానులు సమ్మె చేయడం వల్ల ప్రయాణికులకు కొంత ఇబ్బంది కలిగింది.

అయితే ప్రజలకు రవాణా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు, వెంటనే స్పందించి వేరే ప్రాంతాల నుంచి అదనపు బస్సులను తెప్పించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం. డిపోలో మాలక్ష్మీ పథకం ద్వారా ప్రభుత్వం నుంచి 19 లక్షలు, నెట్ క్యాష్ ద్వారా 12 లక్షలు ఆదాయం వస్తుందని మేనేజర్ పేర్కొన్నారు.

అధికారులు తక్షణమే స్పందించాలి..

కేవలం రంగులు మార్చి, బోర్డులు తిప్పేయడం ద్వారా సామాన్య ప్రయాణికులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయడం సరికాదని స్థానికులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ రంగుల మాయాజాలంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించాలి. ప్రయాణికులపై పడుతున్న అదనపు ఆర్థిక భారాన్ని తగ్గించి, ఇబ్రహీంపట్నం డిపోకు తక్షణమే కొత్త బస్సులను కేటాయించాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

బస్సుల వివరాలు ఇలా..

మొత్తం బస్సులు (గవర్నమెంట్ + ప్రైవేట్ కలిపి) : 138

ప్రభుత్వ సొంత బస్సులు : 75

రూట్ బస్సులు : 58

మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు : 19

పల్లెవెలుగు ప్రైవేట్ బస్సులు (అద్దె) : 63