వంజర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలి
అఖిల భారత వంజరి సేవ సంఘం ఉపాధ్యక్షులు సాల్వేరు కృష్ణ
సిద్దిపేట కలెక్టరేట్, జూలై 14 :వంజరి కులాన్ని షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ జాబితాలో చేర్చి రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని అఖిల భారత డివంజరి సేవ సంఘం ఉపాధ్యక్షులు సాల్వేరు కృష్ణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. వంజరి సమాజం దశాబ్దాలుగా ఎస్టీ హోదా కోసం పోరాడుతోందని, చారిత్రకంగా జరిగిన పరిణామాలను పరిశీలించి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.సాల్వేరు కృష్ణ మాట్లాడుతూ,1976లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ఉత్తర్వులు సవరణ చట్టం 1976‘ ద్వారా ఆంధ్రప్రదేశ్లో సుగాలి,లంబాడి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చినట్లు తెలిపారు.
అనంతరం ఆ చట్టం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 1977 జూన్ 30న జీ.ఓ. నెం.245 జారీ చేసిందన్నారు. అదే కాలంలో శంకరన్ కమిషన్ వంజరి సమాజాన్ని సంచార జాతిగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని ఆయన తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా వంజరులను సుగాలి, లంబాడి సమాజంతో సమానంగా పరిగణిస్తూ జీ.ఓ.245 అమలులో భాగంగా ప్రయోజనాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సుగాలి, లంబాడి పేర్లు మాత్రమే ఉండగా, వంజరి పేరు ప్రత్యేకంగా లేకపోవడం వల్ల అనంతర కాలంలో ఈ అంశంపై వివాదం తలెత్తిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా మాత్రమే రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగపరంగా సరైన విధానం కాదనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని, ఈ నేపథ్యంలో 1979లో జీ.ఓ.44 ద్వారా వంజర్లకు ఎస్టీ రిజర్వేషన్ రద్దు అయిందని వివరించారు.
ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం శంకరన్ కమిషన్ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించి, రాష్ట్రపతి ఉత్తర్వుల్లో వంజరి పేరును అధికారికంగా చేర్చేలా చర్యలు తీసుకుని ఉంటే సమస్య శాశ్వతంగా పరిష్కారమయ్యేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ ప్రకారం ఏ రాష్ట్ర కమిషన్ నివేదిక అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్రానికి, అనంతరం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా పరిశీలనకు పంపి, పార్లమెంట్ ఆమోదంతో రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ జరిగిన తర్వాత మాత్రమే చట్టబద్ధత పొందుతుందని చెప్పారు.
ప్రస్తుతం కూడా శంకరన్ కమిషన్ నివేదికను పునఃపరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని, మహారాష్ట్ర, రాజస్థాన్ , గుజరాత్ రాష్ట్రాలలో ఉన్న వంజరి కులస్తులు కూడా ఎస్టీలుగా గుర్తింపు పొందారు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న వంజరి కులస్తులను బీసీ (డీ) లో నుండి ఎస్టీ జాబితాలో చేర్చే ప్రక్రియను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే వంజరి సమాజం సుగాలి,లంబాడి సమూహంలో భాగమనే అంశాన్ని ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించాలని కోరారు.
వంజరి సమాజం సామాజిక, రాజకీయ,ఆర్థిక, విద్యా రంగాల్లో వెనుకబడిన వర్గంగా కొనసాగుతోందని, ఎస్టీ హోదా కల్పిస్తే విద్య, ఉపాధి, గిరిజన సంక్షేమ పథకాలు వంటి రంగాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తాయని సాల్వేరు కృష్ణ పేర్కొన్నారు. వంజరి సమాజ హక్కుల సాధన కోసం అఖిల భారత వంజరి సేవ సంఘం ఉద్యమాన్ని కొనసాగిస్తుందని, అవసరమైతే రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.వంజరి సమాజానికి న్యాయం జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.






