రూ.3కోట్ల సర్కారు భూమి స్వాహా!
- అధికారుల అండతోనే అక్రమ రిజిస్ట్రేషన్?
- సందయ్యనగర్‌లో ‘నకిలీ’ పర్వం..
- ప్రభుత్వ స్థలానికి దర్జాగా రిజిస్ట్రేషన్..
- అక్రమార్కులకు వరప్రసాదం
- రూ.3 కోట్ల భూమి ప్రైవేటు పరం
- బోర్డు లేదు.. ఫెన్సింగ్ లేదు.. సర్కారు భూమిపై అక్రమార్కుల కన్ను
శేరిలింగంపల్లి, జూలై 14 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కరువైంది. కోట్లాది రూపాయల విలువైన సర్కారు భూములు కళ్ల ముందే కబ్జాకు గురవుతున్నా.. సంబంధిత శాఖల అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. శేరిలింగంపల్లి మండలం సందయ్యనగర్ కాలనీలో సుమారు రూ.3 కోట్ల విలువ చేసే 200 గజాల ప్రభుత్వ స్థలం అక్రమార్కుల పాలు కావడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.
గత 25 ఏళ్లుగా సర్కారు రికార్డుల్లోనే ఉన్న ఈ స్థలాన్ని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకుని, యథేచ్ఛగా నిర్మాణ పనులు చేపడుతున్నా.. రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖలు చోద్యం చూడటం వెనుక భారీ హస్తమే ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.* కాగితాలకే పరిమితమైన నివేదికలు...సందయ్యనగర్ కాలనీ పరిధిలోని సర్వే నంబర్లు 322 నుంచి 328 వరకు ఉన్న సదరు భూమి పూర్తిగా ప్రభుత్వానిదేనని గతంలో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి విచారణ జరిపి తేల్చారు.
ఆ స్థలంపై ఎవరికీ ఎలాంటి వ్యక్తిగత హక్కులు లేవంటూ ఉన్నతాధికారులకు స్పష్టమైన నివేదిక కూడా సమర్పించారు. అయితే, ఆ నివేదికలు కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప క్షేత్రస్థాయిలో భూమికి రక్షణ కల్పించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. అక్కడ కనీసం ప్రభుత్వ భూమి అనే బోర్డు పెట్టకపోవడం, ఫెన్సింగ్ వేసి రక్షించకపోవడంతో అక్రమార్కులకు కాసుల కక్కుర్తి పెరిగింది.
అధికారుల నిర్లక్ష్యాన్నే ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు నకిలీ పత్రాలు సృష్టించి, పీటీఐఎన్ నంబర్ 1120017663, డాక్యుమెంట్ నంబర్ 5552/2025 ఆధారంగా దర్జాగా రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నట్లు తెలుస్తోంది.* కళ్లు మూసుకున్న సీఎంసీ..టౌన్ ప్లానింగ్..ప్రభుత్వ స్థలమని తేలిన చోట ఇప్పుడు ఏకంగా భవన నిర్మాణాలు జరుగుతున్నా అటు జీహెచ్‌ఎంసీ, ఇటు టౌన్ ప్లానింగ్ విభాగాలు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
అసలు ప్రభుత్వ రికార్డుల్లో నిక్షిప్తమై ఉన్న భూమికి రిజిస్ట్రేషన్ ఎలా సాధ్యమైందన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ వ్యవహారంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిబంధనల ప్రకారం జరిగిందా, లేదా లంచాల వెల్లువలో చట్టాలను తుంగలో తొక్కారా అనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.* పోరాటానికి సిద్ధం కాలనీవాసులు..ఎన్నో ఏళ్లుగా ఈ స్థలాన్ని కాలనీ ప్రజల అవసరాల నిమిత్తం కమ్యూనిటీ హాల్ లేదా పార్కు కోసం కేటాయించాలని సందయ్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరుతోంది.
ప్రజావసరాలకు ఉపయోగపడాల్సిన కోట్లాది రూపాయల విలువైన భూమి ఇలా ప్రైవేటు వ్యక్తుల పరం కావడంపై అసోసియేషన్ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ భూ కబ్జాపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని, అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి ప్రభుత్వ ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే, కాలనీవాసులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.






