మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
సీపీ అంబర్ కిషోర్ ఝా
వెంకటాపూర్లో పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
బెల్లంపల్లి, జూలై 16 : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చెడు వ్యసనాలకు బానిస కావద్దని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. గురు వారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా దేవాపూర్ పోలీసులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి మం చిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తో కలిసి హాజరై మాట్లాడారు.
మత్తు పదార్థాలు వ్యక్తిని, కుటుంబాన్ని, సమాజాన్ని నాశనం చేస్తాయని, వాటికి పూర్తిగా దూరంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మారుమూల ప్రాంతాల్లో విద్య, వైద్యం, రవాణా వంటి మౌలిక సదుపాయాలు గణనీయంగా అభివృద్ధి చెందడం ఆనందదాయకమన్నారు.
గ్రామాల్లో మంచి పాఠశాలలు ఏర్పాటు కావడంతో పిల్లలు నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలు కూడా మెరుగైన స్థాయిలో విద్యను అందించడం అభినందనీయమన్నారు. గ్రామ ప్రజలు ఐక్యంగా ఉంటూ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని సూచించారు. మహిళా సంఘాలు స్వయం ఉపాధి, రుణాల ద్వారా ఆర్థికంగా బలోపేతం కావడం అభివృద్ధికి సంకేతమన్నారు.
అనంతరం పోలీసులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో మంచిర్యాల మెడీలైఫ్, సన్రైజ్ ఆసుపత్రి వైద్యులు రక్తపోటు (బీపీ), రక్తంలో చక్కెర పరీక్ష, ఈసీజీ, పీఎఫ్టీఈ, 2డీ ఎకో, అల్ట్రాసౌండ్, కంటి తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ కిరణ్కుమార్, మందమర్రి సీఐ పీ రమేష్, ఎస్‌ఐలు గంగారం(దేవాపూర్), ఆంజనేయులు(కాసిపేట), నరేష్(మందమర్రి), శ్రీధర్(రామకృష్ణాపూర్), మెడీలైఫ్ హాస్పిటల్ వైద్యులు కుమారస్వామి, గౌతమ్, సిరిపురం శ్రీనివాస్, అభినయ్, బోస్, స్వాప్రిక, సన్రైజ్ హాస్పిటల్స్ వైద్యుడు రాజ్కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






