21 June, 2026 | 1:36 AM

కుప్పకూలిన విద్యావ్యవస్థ!

21-06-2026 12:16 AM
  1. రేషనలైజేషన్ పేరుతో స్కూళ్ల తగ్గింపు, మూసివేత
  2. పాఠశాలల్లో టాయిలెట్లు, వసతుల్లేవు
  3. ఓయూకు రూ.వెయ్యి కోట్ల హామీ ఏమైంది? 
  4. బొగ్గు స్కాంపై రేవంత్ అసత్య ప్రచారం
  5. బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎన్‌రాంచందర్‌రావు

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుప్పకూలిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు మండిపడ్డారు. ప్రభు త్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు పెట్టా ల్సి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. గత కేసీఆర్ సర్కార్ విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేస్తే, ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం పూర్తిగా చంపేస్తోందని విమర్శించారు.

రేషనలైజేషన్ పేరి ట స్కూళ్లను తగ్గించి, మూసివేత దిశగా తీసుకెళ్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 90 శాతానికి పైగా ప్రభుత్వ పాఠశాలలు కూలిపోయే స్థితిలో ఉన్నాయని, విద్యార్థినులకు ప్రత్యేక టాయిలెట్లు, కనీస మౌలిక వసతులు లేవని మండిపడ్డారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా ఇప్పటివరకు పాఠ్య పుస్తకాలు ప్రింట్ కాలేదని, విద్యార్థులకు యూనిఫాం అందలేదని పేర్కొన్నారు.

కేంద్రప్రభుత్వ పరిధిలోని కేంద్రీయ విద్యాలయాలకు ఉన్న డిమాండ్, ఉన్నత ప్రమాణాలు.. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలకు ఎందుకు లేవని ప్రశ్నించారు. టీచర్లకు సరైన పదోన్నతులు లేవు, చాలా జిల్లాల్లో డీఈవోలు, ఎంఈవోలు పూర్తి స్థాయిలో లేరన్నా రు. విద్యారంగానికి ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్ కేవలం ఉపాధ్యాయులు, సిబ్బంది వేతనాలకే సరిపోతుందన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వివిధ పార్టీలకు చెం దిన పలువురు రాంచందర్‌రావు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

ఓయూలో కూలిపోయే స్థితిలో హాస్టల్ భవనాలు

ఓయూలో హాస్టళ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. ‘బి’ హాస్టల్ ఇప్పటికే మూతపడిందని.. డి, ఇ హాస్టళ్లు కూలిపోయే స్థితిలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మెస్‌లలో భోజనం నాణ్యత లేదని, విద్యార్థుల సమస్యలు, హక్కులపై మాట్లాడే ప్రొఫెసర్లను సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు. ఓయూకు రూ.వెయ్యి కోట్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి  హామీ ఏ మైందని ప్రశ్నించారు. ఉస్మానియా, కాకతీ య యూనివర్సిటీల హాస్టళ్లను పునర్నిర్మించాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు.  

బొగ్గు దొంగలెవరో తేల్చాలి

సింగరేణి బొగ్గు కుంభకోణంలో వాస్తవాలు బయటకు రాకుండా రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజానిజాలు తెలుసుకోవడానికి తమ పార్టీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం వెళ్లగా రేవంత్ సర్కార్ పోలీసులతో అడ్డుకుందని ఆరోపించారు. 

సమగ్ర విచారణ చేసి బొగ్గు కుంభకోణం దొంగలెవరో తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్రానిది కాగా, 49 శాతం కేంద్రానిదని.. అయినా కనీసం అటెండర్‌ను నియమించే, బదిలీ చేసే అధికారాలు లేవని స్పష్టం చేశారు.  

రాహుల్ ప్రధాని కాడు.. వడ్లు కొనరు

రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేస్తే ధాన్యం కొనుగోలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.  రాహుల్ ప్రధాని కాడు.. రైతుల నుంచి రేవంత్‌రెడ్డి ధాన్యం కొనడని విమర్శించారు.  దేశాభివృద్ధి కోసం యువత, మహిళలు, విద్యావంతులు భారీగా బీజేపీలో చేరి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మరింత బలపరచాలని పిలుపునిచ్చారు.  మైనింగ్, ఎక్స్‌పోర్ట్స్, వేస్ట్ ఎనర్జీ రంగాల పారిశ్రామికవేత్త ఫణికుమార్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఆయనకు రాంచందర్‌రావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.