కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మోసం చేశాయి
- మోదీ నాయకత్వంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు
- బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్
గజ్వేల్, జూన్ 20: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ సామాజిక న్యాయాన్ని బలోపేతం చేస్తున్నామని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రధాని మోదీ ప్రజాస్వామ్య పద్ధతిలో వరుసగా మూడుసార్లు ఎన్నికై దేశానికి సమర్థ నాయకత్వం అందిస్తున్నారన్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవులతో పాటు మహిళలకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా బీజేపీ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ కుటుం బ రాజకీయాలకు ప్రతీకగా మారిందని, ప్రస్తుతం రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమ ర్శించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ పాలనలో అవినీతి, లంచాల సంస్కృతి పెరిగిందని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీల అమలులో విఫలమయ్యారని, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రతిపక్ష బాధ్యతలను విస్మరించారని ఆరోపించారు.






