21 June, 2026 | 2:22 AM

కదం తొక్కిన హిందువులు

21-06-2026 01:08 AM

బంగ్లాదేశ్‌లో.. శ్రీరాముడి విగ్రహ పనులు అడ్డుకున్నారని ఆగ్రహ జ్వాలలు

  1. ‘జైశ్రీరామ్’ నినాదాలతో హోరెత్తిన ఢాకా 
  2. వేలాది మందితో హిందూ సంస్థల మానవహారం 
  3. నిందితులను 72 గంటల్లో అరెస్ట్ చేయాలని డిమాండ్ 
  4. లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని అల్టిమేటం

ఢాకా, జూన్ ౨౦: బంగ్లాదేశ్‌లో హిందువుల ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతు న్నాయి. హిందూ, ధార్మిక, ఆధ్యాత్మిక సం ఘాలు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి.. గైబాంధా జిల్లాలోని పలాష్‌బారిలో 81 అడుగుల ఎత్తుతో శ్రీరాముడి విగ్రహ నిర్మాణాన్ని కొన్ని ఇస్లా మిక్ సంస్థలు కూల్చివేస్తామని శ్రీశ్రీ రాధాగోవింద దేవాలయ కమిటీ సభ్యులను బెది రించడం, ఇస్లాం మత బోధకుడొకరు శ్రీరాముడి విగ్రహాన్ని బుల్డోజర్‌తో కూల్చివేస్తానని హెచ్చరికలు జారీ చేయడం నిరసనలకు కారణమైంది.

కొందరు ఆకతాయిలు విగ్రహంపై చెప్పులు విసరడం కూడా హిందువులకు ఆగ్రహం తెప్పించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శుక్రవారం రాత్రి తొలుత ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు టార్చ్‌లైట్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హిందూ విద్యార్థి సంఘాలు, మైనార్టీ హక్కుల సంస్థలు, సామాజిక సంఘాలు నిరసనలో పాల్గొన్నాయి. దేశ రాజధాని ఢాకా హిందువుల నిరసనలతో అట్టుడికింది.

‘హిందూ మహాజోత్’ అనే సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ర్యాలీ జరిగింది. వేలాది మంది హిందువులు, విద్యార్థులు షాబాగ్ ఇంటర్‌సెక్షన్ నుంచి నేషనల్ ప్రెస్ క్లబ్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అక్కడ మానవహారం చేపట్టారు. కాగడాలు, కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ‘జై శ్రీరామ్’ నినాదాలతో హోరెత్తించారు. ఆలయాలకు రక్షణ కల్పించడంలో తారిఖ్ రెహమాన్ ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపించారు.

రంగ్‌పూర్‌లో ఆందోళనకారుల ప్రదర్శనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. శ్రీరాముడి విగ్రహం విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన నిందితులను 72 గంటల్లో అరెస్ట్ చేయాలని, లేదంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని ‘హిందూ మహాజోత్’ బంగ్లా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ఇదే విషయంపై సదరు సంస్థ ఆ దేశ మత వ్యవహారాల మంత్రిత్వశాఖకు వినతిపత్రం సైతం సమర్పించింది.

మరోవైపు, ఉద్రిక్తతల నేపథ్యంలో శ్రీరాముడి విగ్రహ పనులను ఆలయ కమిటీ తాత్కాలికంగా నిలిపివేసింది. కొన్ని సంస్థల నుంచి తమకు పెద్ద ఎత్తున బెదిరింపులు వస్తున్నాయని, భద్రతాపరమైన కారణాల వల్లే కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌లో హిందువులు అతిపెద్ద మైనారిటీ. అక్కడి జనాభాలో హిందువులు 8 శాతం ఉన్నారు. వారిపై తరచుగా దాడులు జరగటం అనేకసార్లు ఉద్రిక్తతలకు దారి తీసింది.

జనవరి 1 నుంచి మార్చి 31 మధ్య ఏకంగా 133 హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం హిందువులను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. ఫిబ్రవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి, ప్రధానిగా తారిఖ్ రెహమాన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత, హిందువులపై దాడులు ఆగుతాయని ఆ వర్గం ఆశించినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం అలా జరగడం లేదు. అక్కడక్కడా హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.