21 June, 2026 | 1:54 AM

నరహరి బ్యాంకు లాకర్లు బద్దలు

21-06-2026 12:41 AM
  1. రూ.1.5 కోట్ల నగదు లభ్యం
  2. 2 కిలోల బంగారం, వజ్రాల ఆభరణాలు సీజ్ 
  3. శాలిబండ కెనరా బ్యాంకులో నరహరి భార్య పేరు మీద రెండు లాకర్లు
  4. తాళం చెవులు ఇచ్చేందుకు నిరాకరించిన కుటుంబీకులు
  5. బద్దలుకొట్టిన ఏసీబీ అధికారులు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 20 (విజయక్రాంతి): తెలంగాణ సర్వే, భూ రికార్డుల మల్టీజోన్-2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. శనివారం శాలిబండలోని కెనరా బ్యాంకు శాఖలో ఆయన భార్య పేరు మీది రెండు బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు బద్దలుకొట్టారు.

లాకర్ తాళం చెవులు ఇచ్చేందుకు నరహరి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో, అధికారులు హైదరాబాద్‌లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల గౌరవ న్యాయస్థానం నుంచి సెర్చ్ వారెంట్ పొంది బద్దలు కొట్టారు. లాకర్లను తెరిచిన అధికారులకు మైండ్ బ్లాంక్ అయ్యేలా రూ.1.50 కోట్ల నికర నగదుతో పాటు, ఒక్కొక్కటి 100 గ్రాముల బరువున్న 12 బంగారు బిస్కెట్లతో సహా మొత్తం సుమారు 2 కిలోల బరువున్న బంగారం, వజ్రాల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ప్రస్తుతం పట్టుబడిన ఈ ఆస్తులు, ఏవో నరహరిరావుకు సంబంధించి ఇప్పటికే గుర్తించిన ఆస్తులకు అదనమని అధికారులు స్పష్టం చేశారు. ఏసీబీ దర్యాప్తులో నరహరిరావుకు సంబంధించిన విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 1987లో తన తండ్రి వారసత్వంగా ల్యాండ్స్ అండ్ సర్వే డిపార్ట్మెంట్లో కేవలం నెలకు రూ. 700 జీతంతో ‘చైన్మెన్’గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన నరహరిరావు, పదోన్నతులు పొందుతూ డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి చేరారు.

ఈ కాలంలో భూ సర్వేలు, సరిహద్దు వివాదాల పరిష్కారం, భూసేకరణ వంటి కీలక బాధ్యతలను ఆసరాగా చేసుకుని భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా ఇటీవల హైదరాబాద్ పాతబస్తీలోని ఛత్రినాకలో ఉన్న ఆయన నివాసంతో పాటు బంధువులు, బినామీల ఇళ్లపై ఏకకాలంలో 10 చోట్ల ఏసీబీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బెడ్రూమ్‌లో రూ.1.54 కోట్ల నగదు, వివిధ బ్యాంకుల్లో రూ. 2.29 కోట్ల బ్యాలెన్స్, రూ. 5.04 కోట్ల ఫికస్డ్ డిపాజిట్లు లభ్యమయ్యాయి. 1.3 కిలోల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు గుర్తించారు.

పలు చోట్ల ఆస్తుల సంబంధించి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ లెక్కల ప్రకారం ఈ ఆస్తుల డాక్యుమెంట్ (రిజిస్ట్రేషన్) విలువ దాదాపు రూ. 13.05 కోట్లుగా చూపించినప్పటికీ, బహిరంగ మార్కెట్లో రూ. 200 కోట్ల పైమాటే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న నరహరిరావుకు సంబంధించి బినామీ ఆస్తులు, బ్యాం కు ఖాతాల వివరాలపై విచారణ జరుపుతున్నారు.