కూతురి ఆత్మగౌరవం..
రైల్వే శాఖతో నాన్న పోరాటం
మేధో వైకల్యం కార్డుకు రూపం
నేడు -ఫాదర్స్ డే :
కూతురి ఆత్మగౌరవం కోసం ఏకంగా రైల్వే శాఖతో పోరాడి గెలిచిన ఓ తండ్రి.. ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి యావత్ భారతదేశానికి దిక్చూచి అయ్యాడు. దివ్యాంగురాలైన తన కూతురి కోసం రైల్వే అధికారులు ఇచ్చిన కన్సెషన్ కార్డులో ఒక పదం తప్పుగా రాశారని, అది ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని నిర్విరామంగా పోరాడి చివరకు అనుకున్నది సాధించాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పంకజ్ మారు వృత్తిరీత్యా ఇంజనీర్.
ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా వాగ్డా పట్టణంలో స్పెషల్ నీడ్ ఎడ్యుకేషన్ హోమ్ నందు సేవలందిస్తున్నారు. మేధోవైకల్యం ఉన్న వారికి పునరావాసం, స్వయం సమృద్ధి కల్పించడం కోసం ఒక బృందంగా ఏర్పడి వీరు పనిచేస్తున్నారు.
పంకజ్ మారుకు తన కూతురు సోనూ అంటే ప్రాణం. మన దేశంలో ప్రభుత్వాలు కల్పిం చే సదుపాయాలు, ప్రయోజనాలు పొందాలంటే ‘రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసిబిలిటీస్ యాక్ట్- 2016’ ప్రకారం ప్రత్యేక వైకల్యం గుర్తింపు కార్డు (యూడీఐడీ) తో పాటు వైకల్య ధృవీకరణ పత్రం కూడా ఉండాలి. పంకజ్ మారు కూడా తన కూతురి కోసం యూడీఐడీ తీసుకున్నారు. ఆ తర్వాత రైల్వే కన్సెషన్ కార్డు కోసం దరఖాస్తు చేశారు.
అయితే పశ్చిమ రైల్వే జారీ చేసిన ఆ కన్సెషన్ కార్డులో వైకల్యం ఏ కేటగిరీకి చెందినదో తెలిపే చోట మానసిక వికృత్ అని రాశారు. ఆ పదం చదివి పంకజ్ మారు తీవ్రంగా కలత చెందారు. ‘ఎవరైనా సరే ఒక బిడ్డను ’వికృత్’ అని ఎలా అంటారు? అది ఎంత అవమానకరమైన పదం! ‘అని ఆయన హృదయం ద్రవించింది. కార్డు మీదే కాకుండా,దాని పైభాగంలో ముద్రించిన నిబంధనలలో కూడా అదే పదాన్ని వాడారు.
దీనిపై ఆయన వెంటనే స్పందిస్తూ రైల్వే డివిజనల్ మేనేజర్ (డీఆర్‌ఎం)కు లేఖ రాశారు. చట్ట ప్రకారం ఆ పదాన్ని తీసేసి ‘మేధో వైకల్యం’ అని మార్చాలని కోరారు. అయితే, ఆ మార్పు లు చేయడం తమ చేతుల్లో లేదంటూ జనరల్ మేనేజర్‌తో మాట్లాడమని డీఆర్‌ఎమ్ తిరుగు టాపా ఇచ్చారు. ముంబై రైల్వే ప్రధాన కార్యాలయానికి ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది.
కోర్టు మెట్లెక్కిన తండ్రి
పంకజ్ మారు ‘చీఫ్ కమిషనర్ ఫర్ పర్స న్స్ విత్ డిసిబిలిటీస్’ కోర్టును ఆశ్రయించి 2024లో కేసు దాఖలు చేశారు. కోర్టు నోటీసులు జారీ చేసిన వెంటనే రైల్వే అధికారుల బృందం పంకజ్ మారు దగ్గరకు వచ్చింది. వారు కార్డులోని ఆ పదాన్ని మార్చారు కానీ, ‘మానసిక వికృత్’ బదులు ‘మానసిక బలహీనత’ అనే మరో పదాన్ని ఉపయోగించారు. ఆ పదం కూడా సరైంది కాదని, చట్టబద్ధంగా మేధో వైకల్యం అనే పదాన్నే వాడాలని పంకజ్ మారు పట్టుబట్టారు.
రైల్వే శాఖ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. సుదీర్ఘ ప్రక్రియ అనంతరం రైల్వే శాఖ 2025 మే నాటికి అన్ని చర్యలు పూర్తి చేసి ఒక అధికారిక ఉత్తర్వుతో పాటు కొత్త ఈ--పోర్టల్‌ను సిద్ధం చేసింది. అందులో మేధో వైకల్యం ఉన్న వ్యక్తి.. సహాయకులు లేకుండా రైలులో ప్రయాణించకూడదు అని గౌరవప్రదంగా మార్పులు చేశారు.
దేశవ్యాప్తంగా మారిన చట్టం
పంకజ్ మారు చేసిన ఈ పోరాటం వల్ల కేవలం ఆయన కూతురు సోనూకే కాకుండా 2025 జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా దివ్యాంగులందరికీ మేధో వైకల్యం అని రాసి ఉన్న కొత్త కార్డులను జారీ చేయడం ప్రారంభించారు. కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చినప్పుడు నాకు ఎంతో ఆత్మసంతృప్తి లభించింది. ఒక తండ్రిగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించి, నా బిడ్డకు సమాజంలో రావలసిన గౌరవాన్ని అందించగలిగాను. ఒక తండ్రికి ఇంతకంటే పెద్ద విజయం ఏముంటుంది?‘ అని పంకజ్ మారు గర్వంగా చెబుతారు.
కొండేటి ప్రకాష్






