21 June, 2026 | 2:43 AM

పాడి రైతుకు భరోసా!

21-06-2026 01:28 AM
  1. ప్రభుత్వ పాఠశాలలకు విజయ డెయిరీ పాలు
  2. సకాలంలో బిల్లుల చెల్లింపు
  3. ఉన్నతస్థాయిసమీక్షలో నిర్ణయం
  4. వివరాలు సమర్పించాలని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం 
  5. సమావేశంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి) : తెలంగాణలో పాడి పరిశ్రమను లాభసాటిగా మార్చడానికి మరియు పాడి రైతులకు ఆర్థిక భరోసా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రైతులకు బకాయిలు లేకుండా సకాలంలో చెల్లింపులు జరపడం, పాఠశాలలకు విజయ డెయిరీ పాలను సరఫరా చేయడం వంటి చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యతన సచివాలయంలో శనివారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమీక్షలో పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పాడి పరిశ్రమ అభివృద్ధి, పాల సేకరణ, రైతులకు చెల్లించాల్సిన బకాయిలపై చర్చించారు.  ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 27 లక్షల మంది విద్యార్థులకు అందించేందుకు విజయ డెయిరీ పాలను సరఫరా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయికి వెళ్లి పాడి గేదెలను గుర్తించాలని, వాటి ద్వారా ప్రస్తుతం ఉత్పత్తి జరుగుతున్న పాలను లెక్కగట్టి సమగ్ర నివేదికను తదుపరి సమావేశంలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పాడి రైతుల నుంచి సేకరించే పాల ధరపై స్పష్టమైన విధానం ఉండాలన్నారు. 

బిల్లుల చెల్లింపులో జాప్యం జరగొద్దు

రైతులకు బకాయులు లేకుండా ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పాఠశాలలకు సరఫరా చేసే పాలకు సంబంధించిన బిల్లులను సంక్షేమ శాఖలు నేరుగా ఆయా విభాగాలకే బదిలీ చేయాలని సూచించారు. దీనివల్ల రైతులకు బకాయిలు ఉండవని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది పాడి పరిశ్రమ మీదే ఆధారపడతారని, సకాలంలో డబ్బులు చెల్లిస్తే.. వారి కుటుంబం ఆర్థికంగా బలోపేతం అవుతుందన్నారు.

అంతేకాకుండా డెయిరీకి నమ్మకంతో పాలు పోస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమను లాభసాటిగా మార్చేందుకు, పాల ఉత్పత్తులను గణనీయంగా పెంచేందుకు ఆధునిక పద్ధతులను అవలంభించాలని ఆయన సూచించారు. రైతులకు వ్యవసాయం పైనే కాకుండా, పాడి పరిశ్రమ ద్వారా అదనపు జీవనోపాధి కల్పించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు.