21 June, 2026 | 1:36 AM

రాజ్యాంగ విలువలను బీజేపీ దెబ్బతీస్తోంది

21-06-2026 12:13 AM
  1. ప్రాంతీయ పార్టీలను బలహీన పరిచేందుకు కుట్రలు
  2. పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): బీజేపీ రాజ్యాంగ విలువలను దెబ్బతీస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపిం చారు. మహాత్మా గాంధీ ఆలోచనలను పక్కనబెట్టి, గాడ్సే భావజాలాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలు జరుగు తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిర స్కరించడాన్ని నిరసిస్తూ శనివారం గాంధీ భవన్‌లో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాజీవ్‌గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆలిండియా చైర్మన్ సునీల్ పన్వ ర్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ హాజరై సంఘీభావం తెలిపారు. దీక్షలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే నవీన్ యాద వ్, పలువురు డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహేష్ కుమార్‌గౌడ్ మాట్లాడుతూ... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉద్యోగాల కల్పన పేరుతో యువత ను మోసం చేసిందని, రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలనే కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చిందని ఆరోపించారు. దేశ సంపద కొద్దిమంది అనుకూల వర్గాల చేతుల్లోనే కేంద్రీకృతమవుతోందని ఆరోపించారు. విద్యా సంస్థల్లో ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఉన్న వ్యక్తులను ప్రవేశపెట్టి వ్యవస్థను బలహీనపరుస్తోందని విమర్శించారు.

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిర స్కరణ వ్యవహారంలో ఎన్నికల అధికారులు అన్యాయంగా వ్యవహరించారని ఆరోపించారు. కేసులు లేకపోయినా నామినేషన్‌ను తిరస్కరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. ఇదే తరహా పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లో అభ్యర్థులకు అవకాశం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయన్నారు. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రాణత్యాగాలు చేశారని, కానీ వారి కుటుంబంపై అసత్య ప్రచారం జరుగుతోందని విమర్శించారు.