హైడ్రా.. సానుకూల పరిణామం
- కమిషనర్ రంగనాథ్ పని భేష్
- పేదలకు పరిహారం, పునరావాసం కల్పించి, ఇళ్లను కూల్చాలి
- టీఆర్‌ఎల్డీ అధ్యక్షుడు కపిలవాయి దిలీప్‌కుమార్
- లక్డీకాపూల్‌లో హైడ్రాపై రౌండ్ టేబుల్ సమావేశం
- హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో హైడ్రా ఏర్పాటు సానుకూల పరిణామం అని తెలంగాణ రాష్ట్ర లోక్ దళ్ (టీఆర్‌ఎల్డీ) అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ అన్నారు. టీఆర్‌ఎల్డీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని లక్డీకాపూల్ హోటల్ సెంట్రల్ కోర్టులో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హైడ్రాపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కపిలవాయి దిలీప్ కుమార్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైడ్రా ఏర్పాటు ఒక సానుకూల పరిణామమని పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంచి పని చేస్తున్నారని అభినందించారు. అయితే పేదల నివాసాలను తగిన పరిహారం ఇచ్చి, పునరావాసం కల్పించకుండా కూల్చివేయరాదని ఆశాభావం వ్యక్తం చేశారు. పర్టైన్ (ఐఎఫ్‌ఎస్) మాట్లాడుతూ.. చెరువులు, కుంటల సంరక్షణ నేటి అత్యవసర అవసరమని, ప్రజలు కూడా వాటి పరి రక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు.
ప్రముఖ న్యాయవాది, రాజకీయ విశ్లే షకుడు శరత్ మాట్లాడుతూ.. హైడ్రాకు మం చి పేరు, చెడు పేరు రెండూ వచ్చాయని, ముఖ్యంగా అనేక సందర్భాల్లో న్యాయవ్యవస్థ ఆగ్రహానికి గురైందని పేర్కొన్నారు. బలహీన వర్గాల విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. సామాజిక కార్యకర్త అదూరి కరుణ మాట్లాడుతూ.. హైడ్రా బలహీన వర్గాలపై చేపడుతున్న చర్యల వల్ల వారిలో ఆందోళన నెలకొందని, అయితే ధనికులు, ఆక్రమణదారులపై తీసుకుంటున్న చర్యలను ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు.
గోపాల్‌శర్మ మాట్లాడుతూ.. హైడ్రా తన కార్యకలాపాల్లో నిష్పాక్షికంగా వ్యవహరించాలని, ముఖ్యంగా ఎంఐఎం నాయకుల ఆక్రమణలను కూడా ఉపేక్షించరాదని సూచించారు. ఉప్పల శారద మాట్లాడుతూ.. హైడ్రా చర్యల వల్ల బలహీన వర్గాల ప్రయోజనాలు దెబ్బతింటాయనే భయం వారిలో ఉందన్నారు. టీయూ ఎఫ్ ప్రతినిధి భగవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. హైడ్రా ధనికులు, ఆక్రమణదారులపై చర్యలు కొనసాగిస్తూనే బలహీన వర్గాల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా పరిగణించాలని కోరారు.
రిటైర్డ్ ఐఏఎస్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రాజకీయ నాయకుల మాట వినే అధికారులకు కీలక పదవులు లభిస్తున్నాయని, నిజాయితీ గల అధికారులు నిర్లక్ష్యా నికి గురవుతున్నారని పేర్కొన్నారు. హైడ్రా నిష్పాక్షికంగా పనిచేయాలని కోరారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. గత 70 సంవత్సరాల్లో హైదరాబాద్‌లో జరిగిన అనేక ఆక్రమణలను ప్రస్తావించి, చెరు వులు, కుంటల పునరుద్ధరణలో హైడ్రా చేస్తు న్న పనిని అభినందించారు.
టీఆర్‌ఎల్డీ పొలి ట్ బ్యూరో సభ్యుడు వివిఎస్ సత్యనారాయణ మాట్లాడుతూ.. హైడ్రా కార్యకలాపా లు మంచి భవిష్యత్తు కోసం అత్యవసరమని, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని చెరువులు, కుంటలను ప్రతి ఒక్కరూ పరిరక్షించి, హైడ్రాకు సహకరించాలని పిలుపునిచ్చారు.
ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ మాట్లాడు తూ.. హైడ్రా, దాని కమిషనర్ రంగనాథ్ ఆక్రమిత భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో, చెరువులను పునరుద్ధరించ డంలో ప్రశంసనీయమైన సేవలు అందిస్తున్నారని అన్నారు. అయితే బలహీన వర్గాల విషయంలో నిష్పాక్షికంగా వ్యవహరించి, పూర్తి పునరావాస ప్యాకేజీ అందించకుండా వారి ఇళ్లను కూల్చివేయరాదని కోరారు.
జలాశయాల పునరుద్ధరణకు కట్టుబడి ఉన్న సంస్థ: రంగనాథ్
హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. హైడ్రా చెరువులు, కుంటల పునరుద్ధరణకు కట్టుబడి ఉన్న సంస్థ అని, ఏ రాజకీయ పార్టీ లేదా వ్యక్తి ప్రభావానికి లోనుకాదని స్పష్టం చేశారు. ఇది ఒక మహత్తరమైన బాధ్యత అయినప్పటికీ, హైదరాబాద్, పరిసర ప్రాంతాల చెరువులు, కుంటలను పునరుద్ధరించేందుకు హైడ్రా కట్టుబడి ఉందన్నారు. బలహీన వర్గాలు, దిగువ మధ్యతరగతి ప్రజల ఇళ్లను తొలగించే సందర్భాల్లో తగిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతున్నామని తెలిపారు.
ఇప్పటివరకు సుమారు 30 వేల దరఖాస్తులు అందాయని, వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిశీలిస్తూ అత్యవసర అంశాలపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల సూచనలను స్వాగతిస్తున్నామని, సాధ్యమైన చోట తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తాము కూడా మనుషులమే కాబట్టి తప్పులు జరిగే అవకాశం ఉందని, అయితే వాటిని సరిదిద్దుకుని హైదరాబాద్ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
టీఆర్‌ఎల్డీ అధికార ప్రతినిధి బీరప్ప, గిరి కుందే అతిథులను స్వాగతించి, కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో టీఆర్‌ఎల్డీ ప్రధాన కార్యదర్శులు విశాల్, రిషభ్, నరసింహారావు, టీఆర్‌ఎల్డీ యువజన విభాగం అధ్యక్షుడు విక్రమ్ రాజ్ కుమార్ రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగుల విభాగం అధ్యక్షుడు డా. శ్రీనివాస్, టీఆర్‌ఎల్డీ కార్యదర్శులు ఓంకార్ గౌడ్, కోటి, ఆర్‌ఎల్డీ జిల్లా అధ్యక్షులు సుధాకర్‌రెడ్డి, రాంప్రసాద్‌తో పాటు పలువురు ఆర్‌ఎల్డీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






