విద్యుత్ శాఖలో నకిలీలపై కదలిక!
- నకిలీ సర్టిఫికెట్లపై విచారణ కమిటీ వేసిన సీఎండీ
- 2020 తర్వాత నియామకాలపైనే నిఘా
సంగారెడ్డి, జూన్ 20 (విజయక్రాంతి): తెలంగాణ విద్యుత్ శాఖలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగులుగా నియామకమైన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఆ శాఖ యాజమాన్యం స్పందించింది. ఈ మేరకు నకిలీ సర్టిఫికెట్ల భాగోతం భయటపెట్టేందుకు సర్టిఫికెట్ల విచారణ కమిటీ ఏర్పాటు చేస్తూ టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్ శాఖలో నకిలీ ఉద్యోగులపై మే 22న ‘విద్యుత్ శాఖలో నకిలీలు’ అనే శీర్షికతో పాటు ఈ నెల 5న ‘షాక్ కొట్టే నిజాలు’ అనే శీర్షికతో విజయక్రాంతి దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి.
సంగారెడ్డి కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్ల ఉదంతాన్ని విజయక్రాంతి వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సీఎండీ తీవ్రస్థాయిలో స్పందించారు. 2020 తర్వాత నియామకమైన జేఎల్‌ఎంల విద్యార్హత పత్రాలను పరిశీలించడానికి ఒక కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నకిలీల భాగోతాన్ని వివరిస్తూ వచ్చిన కథనాలతో ఒక్కసారిగా విద్యుత్ శాఖలో కదలిక ప్రారంభమైంది.
అందులో భాగంగానే కరీంనగర్ వేదికగా జరుగుతున్న నకిలీ సర్టిఫికెట్ల భాగోతాన్ని గట్టురట్టు చేశారు. సీఎండీ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మొదట జెఎల్‌ఎం సర్టిఫికెట్లను పరిశీలించిన తర్వాతనే మిగతా అనుమానితుల సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నట్లు సమాచారం. కిందిస్థాయి ఉద్యోగుల నుండి మొదలై ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు వెళ్ళేందుకే ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.
ఇలావుండగా సంగారెడ్డి విద్యుత్ సర్కిల్ పరిధిలో కొందరు నకిలీ సర్టిఫికెట్లతో నియామకం అయ్యారని బయటపడడంతో ఓ విజిలెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన నివేదిక కీలకంగా మారింది. జెఎల్‌ఎంలే కాకుండా విద్యుత్ శాఖలోని పలు విభాగాల్లోని ఉద్యోగుల సర్టిఫికెట్లపై విచారణ జరిపారు. అయితే సీఎండీ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పోలీసు శాఖలో ఎన్నో నేర పరిశోధనలో కీలకంగా వ్యవహరించిన అధికారిని ఇప్పుడు జరగబోయే సర్టిఫికెట్ల తనిఖీలో కీలకం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం.






