కాంగ్రెస్‌కు పాలించే అర్హత లేదు
- సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలి
- మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, కమలాకర్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): రాష్ట్ర రైతాంగాన్ని వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలించే అర్హత కోల్పోయిందని, సీఎం రేవంత్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులు పండించిన ప్రతి గింజ నూ కొనుగోలు చేస్తామని, అవసరమైతే విదేశాలకు ఎగుమతి చేస్తామని కాంగ్రెస్ నేతలు హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోళ్ల విషయంలో చేతులెత్తేశారని విమర్శించారు. గతంలో రైతుల సమస్యలను చూపిస్తూ కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు మరింత దారుణ పరిస్థితులను సృష్టించారని ఆరోపించారు. బీఆర్ ఎస్ పాలనలో 2020లో 92.68 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, కానీ ప్రస్తుత యాసంగిలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 50 లక్షల టన్నులకే పరిమితమైందని తెలిపారు.
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాహుల్‌గాంధీ సమ క్షంలో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. రాహుల్‌గాంధీ జన్మదినం నాడే రాష్ట్ర రైతాంగానికి అన్యాయం జరిగిందని విమర్శించారు. రైతుభరోసా, రుణమాఫీ, పంటల బీమా అమలు చేయలేకపోయిందన్నారు. యూరియా సరఫరాలో లోపాలు ఉన్నాయని, యాప్ ఆధారిత పంపిణీ కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
సన్నరకాల వరి సాగుపై ప్రభుత్వం స్పష్టత లేకుండా వ్యవహరించిందని ఆరోపించారు.ప్రభుత్వం సూచించిన రకాలనే సాగు చేస్తే ఎకరాకు సుమారు 10 క్వింటాళ్ల దిగుబడి నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. కాళేశ్వరం, పాలమూరు- ప్రాజెక్టులను రాజకీయ కక్షతో పక్కనపెట్టారని, ఆరోపించారు.. రైతుబీమా ప్రీమియం సకాలంలో చెల్లించకపోవడం వల్ల వేలాది రైతు కుటుంబాలు పరిహారానికి నోచుకోలేదని ఆరోపించారు. పంటలబీమా అమలుకు చర్యలు తీసుకోలేదన్నారు. పంటల కొనుగోళ్లు, రైతుభరోసా, రైతుబీమా, రుణమాఫీ వంటి అన్ని అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.






